ఆస్కార్‌కి వెళ్తున్న లాపతా లేడీస్
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:59 AM
వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇండియా నుంచి వెళ్లే సినిమా ఖరారైపోయింది. ఆ చిత్రమే.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య.. ‘ధోబీ ఘాట్’ ఫేమ్ కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’. 2025 సంవత్సరానికిగాను...
వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇండియా నుంచి వెళ్లే సినిమా ఖరారైపోయింది. ఆ చిత్రమే.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య.. ‘ధోబీ ఘాట్’ ఫేమ్ కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’. 2025 సంవత్సరానికిగాను ఉత్తమ విదేశి చిత్రాల జాబితాలో మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని నామినేట్ చేస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) ఛైర్మన్ జహ్ను బారువా ఇతర నిర్వాహకులు రవి కొట్టార్కర, సి.కళ్యాణ్ తదితరులతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ల కోసం తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, హిందీ భాషలకు చెందిన 29 చిత్రాలను 13 మందితో కూడిన కమిటీ సభ్యులు షార్ట్‌లిస్ట్‌చేయగా, అందులో ‘లాపతా లేడీస్’ను అధికారిక ఎంట్రీగా సభ్యులంతా ఎంపిక చేసినట్టు జహ్ను బారువా వెల్లడించారు. కాగా, మార్చి ఒకటిన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులనూ పొందింది. అలాగే, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 75వ వార్షికోత్సవాల్లోనూ ఆ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. కొత్తగా పెళ్లైన ఓ గ్రామీణ జంట జీవితాల్లో జరిగిన అనూహ్య సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
వారు ఎదుర్కొన్న అనేక సమస్యలను ఇందులో మనసుకు హత్తుకునేలా తెరకెక్కించడమే ఈ చిత్ర విజయానికి కారణం. ఈ సినిమాతో పాటు తెలుగు చిత్రసీమ నుంచి ‘కల్కి 2898 ఏ.డీ’, ‘హను-మాన్’, ‘మంగళవారం’ చిత్రాలు.. బాలీవుడ్ నుంచి ‘యానిమల్’, ‘కిల్’, శ్రీకాంత్’, ‘ఆర్టికల్ 370’, ‘మైదాన్’.. మలయాళం నుంచి నేషనల్ అవార్డ్ విన్నర్ ‘‘ఆట్టమ్’, ‘ఆడు జీవితమ్’, ‘ఆల్ వియ్ ఇమాజిన్ ఆజ్ లైట్’.. తమిళ్ నుంచి ‘వాజీ’, ‘మహరాజా’ వంటి 29 చిత్రాలు పోటీ పడ్డాయి.
నమ్మకం నిజమైంది
‘లాపతా లేడీస్’ ఆస్కార్‌కు ఎంపికైనందుకు దర్శకురాలు కిరణ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. నా నమ్మకం నిజమైంది. సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన మా చిత్రబృందానికి దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ఈ సినిమాను ఎలా ఆదరించారో.. అంతర్జాతీయంగానూ అంతే ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.