మిస్ పర్ఫెక్ట్‌గా ఉన్న నేను మిసెస్ పర్ఫెక్ట్‌నయ్యా
ABN , Publish Date - Jan 24 , 2024 | 12:51 AM
‘అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున మా సిరీస్ ట్రైలర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్ఫెక్ట్. కానీ పూర్తయ్యే లోపు మిసెస్ పర్ఫెక్ట్ అయ్యా. దీనికి ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్టుల వల్ల...

‘అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున మా సిరీస్ ట్రైలర్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మిస్ పర్ఫెక్ట్. కానీ పూర్తయ్యే లోపు మిసెస్ పర్ఫెక్ట్ అయ్యా. దీనికి ముందు నేను చేసిన కొన్ని ప్రాజెక్టుల వల్ల అలసిపోయా. అలాంటి టైమ్‌లో ‘మిస్ పర్ఫెక్ట్’ లాంటి స్ర్కిప్ట్ దొరకడం నాకు పెద్ద రిలీఫ్’ అన్నారు లావణ్య. ఆమెతో పాటు అభిజిత్, అభిజ్ఞ కీలక పాత్రలు పోషించిన ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అన్నపూర్ణ స్డూడియో బేనర్‌పై సుప్రియ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. సోమవారం రాత్రి జరిగిన ప్రెస్‌మీట్‌లో సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లావణ్య మాట్లాడుతూ ‘సుప్రియ గారితో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం చేశాను. అది హిట్ అయింది. ఈ సిరీస్ కూడా హిట్ కావాలి. మా దర్శకుడు విశ్వక్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అన్నారు. దర్శకుడు విశ్వక్ మాట్లాడుతూ ‘లావణ్య ‘అందాల రాక్షసి’ చిత్రంలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో అటువంటి నటనే ఈ సిరీస్‌లో కావాలనుకున్నా. అలాగే అభిజిత్ నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చూశాను. ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం తనకు లేకున్నా ఈ సిరీస్ కోసం ఆడిషన్ ఇచ్చాడు. షూటింగ్ టైమ్ సరదాగా గడిచింది’ అని చెప్పారు. నిర్మాత సుప్రియ మాట్లాడుతూ ‘కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం అంటే నాగార్జునగారికి, తాతగారికి ఇష్టం. అందుకే అన్నపూర్ణ సంస్థ పెట్టారు. చాలా మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. చాలా మంది అమ్మాయిలు నో చెప్పిన పాత్రను నేను చేస్తానంటూ ముందుకు వచ్చి తన గట్స్ ఏమిటో ప్రూవ్ చేసింది అభిజ్ఞ. అభిజిత్ తన పాత్ర బాగా చేశాడు. మిస్ పర్ఫెక్ట్ కు లావణ్య పర్ఫెక్ట్. ఒక చిన్న కథలో బలమైన పాత్రలు ఉండి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభిజిత్, రోషన్, కేశవ్, మహేశ్ విట్టా, అభిజ్ఞ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అదీప్ అయ్యర్ తదితరులు కూడా మాట్లాడారు.