మేమున్నామని.. మీకేం కాదని..

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:28 AM

వరదలతో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే తమవంతు సాయాన్ని అందించగా బుధవారం మరికొందరు విరాళాలను ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు...

వరద బాధితులకు సినీ ప్రముఖుల సాయం

వరదలతో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే తమవంతు సాయాన్ని అందించగా బుధవారం మరికొందరు విరాళాలను ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి రూ. కోటి సాయాన్ని ప్రకటించారు. ఆంద్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ఆయన సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘వరద వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను కలిచివేశాయి. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అందరూ తమకు తోచినట్లు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. ఈ విపత్కర పరిస్థితులు త్వరలోనే తొలగిపోవాలి’ అని ఆయన ఆకాంక్షించారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ సైతం రూ. 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. తెలుగు ప్రజలకు అందరూ అండగా ఉండాల్సిన సమయమిదని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వరద బారిన పడిన 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. నాలుగు కోట్ల సాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.


అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ తనవంతుగా రూ. రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. కోటి చొప్పున అందజేయనున్నట్లు ఆయన టీమ్‌ తెలిపింది. అల్లు అర్జున్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళంగా ఇస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఈ విపత్కర పరిస్థితులు తొలగిపోయి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అక్కినేని కుటుంబం, గ్రూపు సంస్థలు రెండు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళాన్ని ప్రకటించాయి. ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 25 లక్షల సాయాన్ని ప్రకటించిన వైజయంతీ మూవీస్‌ సంస్థ తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్‌ పండ్‌కు రూ. 20 లక్షల విరాళాన్ని ప్రకటించింది. నిర్మాత అశ్వనీదత్‌ బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలసి చెక్‌ అందజేశారు. హీరో సాయిదుర్గతేజ్‌ ఇరు రాష్ట్రాలకు కలిపి రూ. 20 లక్షలు, విజయవాడలోని అమ్మ ఆశ్రమానికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. అలీ, జుబేదా దంపతులు ఇరు రాష్ట్రాలకు కలిపి రూ. ఆరు లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.


పవన్‌ కల్యాణ్‌ - రూ. 2 కోట్లు (ఏపీలోని గ్రామ పంచాయితీలకు రూ. 4 కోట్లు)

ప్రభాస్‌ - రూ. 2 కోట్లు

చిరంజీవి - రూ. కోటి

రామ్‌చరణ్‌ - రూ.కోటి

అల్లు అర్జున్‌ - రూ. కోటి

అక్కినేని కుటుంబం, గ్రూప్‌ సంస్థలు కలిపి - రూ. కోటి

సాయిదుర్గ తేజ్‌ -రూ.20 లక్షలు

వైజయంతీ మూవీస్‌ - రూ. 20 లక్షలు (తెలంగాణకు)

అలీ, జుబేదా దంపతులు - రూ. 6 లక్షలు

Updated Date - Sep 05 , 2024 | 03:28 AM