గిన్నిస్‌ బుక్‌లో మెగా స్టెప్‌

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:23 AM

మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మరో అరుదైన గౌరవం ఆయన సొంతమైంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చిరంజీవి స్థానం దక్కించుకున్నారు. తను నటించిన సినిమాల్లోని...

మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మరో అరుదైన గౌరవం ఆయన సొంతమైంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చిరంజీవి స్థానం దక్కించుకున్నారు. తను నటించిన సినిమాల్లోని 537 పాటల్లో 24 వేల డాన్స్‌ స్టెప్పులతో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో ప్రేక్షకులను అలరించినందుకు ఆయనను ఈ అవార్డ్‌కు గిన్నిస్‌ నిర్వాహకులు ఎంపికచేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి రిచర్డ్స్‌, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ సంయుక్తంగా సర్టిఫికేట్‌ను చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి డాన్స్‌ అంటే ప్రాణం. ఆ ఆసక్తి వల్లే ఈ రికార్డు నా సొంతమైంది. ఈ ఘనత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘చిరంజీవికి నేను వీరాభిమానిని. నేను ఆయనను పెద్దన్నయ్యలా భావిస్తాను. ఆయనకు ఇంత గొప్ప గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. మెగా హీరోలు సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌.. డైరెక్టర్లు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీ.. నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు, అశ్వనీదత్‌ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.


ప్రముఖుల అభినందనలు

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చిరంజీవికి చోటు దక్కడం పట్ల ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి తన నటన, డాన్స్‌తో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కీలకపాత్ర పోషించారు అని అభినందించారు. చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కడం తెలుగు వారిగా మనమంతా గర్వించాల్సిన సందర్భం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. నృత్యం అంటే మెగాస్టార్‌, మెగాస్టార్‌ అంటేనే నృత్యం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిరంజీవిని కొనియాడారు. ఏదైనా సాధించాలనుకునే యువత చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలని హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సూచించారు. విజయాలు, రికార్డులు అన్నయ్యకు కొత్త కాదు, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కడం ఎంతో ప్రత్యేకం అని ఏపీ డిప్యూటీ సీఎం పవ న్‌ కల్యాణ్‌ స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు చిరంజీవిని అభినందించారు.

Updated Date - Sep 23 , 2024 | 06:23 AM