పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా

ABN , Publish Date - May 28 , 2024 | 03:41 AM

‘మెహబూబా’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన నేహా శెట్టి.. ఆ తర్వాత వరుస చిత్రాలతో సందడి చేశారు. ఆమె నటించిన ‘డీజే టిల్లు’ సినిమాలోని రాధిక పాత్రతో కుర్రకారుని విశేషంగా...

పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా

‘మెహబూబా’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన నేహా శెట్టి.. ఆ తర్వాత వరుస చిత్రాలతో సందడి చేశారు. ఆమె నటించిన ‘డీజే టిల్లు’ సినిమాలోని రాధిక పాత్రతో కుర్రకారుని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా తెలుగునాట ఎంతో పాపులారిటీని సంపాదించారు. ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చి సూపర్‌హిట్‌ అయిన ‘టిల్లు స్క్వేర్‌’లోనూ కాసేపు తళుక్కుమన్నారు. ఆమె నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించగా, కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.


‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు బుజ్జి. మాటల కంటే కళ్లతోనే భావాలను పలికించే పాత్ర ఇది. ఇందులో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో బుజ్జి పాత్ర కూడా ఒకటి. ఈ సినిమా మొత్తం రత్న, రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ తిరుగుతుంది. సినిమా అంతా 90వ దశకంలో సాగుతుంది కాబట్టి అందుకు తగ్గ ఆహార్యం, అభినయాన్ని చూపించడానికి చాలా కష్టపడ్డాను. విశ్వక్‌తో కలసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో విశ్వక్‌ రూపంలో నాకు మంచి స్నేహితుడు దొరికాడు. సినిమాలో అంజలి, నాకు మధ్య ఉన్న కాంబినేషన్‌ సీన్స్‌ తక్కువ. ఆమె ఎప్పుడూ చాలా చలాకీగా ఉంటారు. దర్శకుడు కృష్ణచైతన్య కథ రాసిన విధానం, సినిమాను తెరకెక్కించిన పద్ధతి అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రచార చిత్రాలు చూసి అందరూ ఈ సినిమాలో యాక్షన్‌ మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇందులో అన్ని రకాల ప్రేక్షకులకి కావాల్సిన కామెడీ, డ్రామా, రొమాన్స్‌ ఉంటాయి’’ అని చెప్పారు.

Updated Date - May 28 , 2024 | 03:41 AM