దేవర సినిమాను కలసి చూద్దాం
ABN , Publish Date - Sep 15 , 2024 | 02:52 AM
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్‌ను జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు. కౌశిక్ బెంగళూరు కిద్వాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆ అభిమానితో దాదాపు 10 నిమిషాలు...
అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్‌ను జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు. కౌశిక్ బెంగళూరు కిద్వాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆ అభిమానితో దాదాపు 10 నిమిషాలు ఎన్టీఆర్ వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ‘‘నువ్వు నవ్వుతుంటే చాలా బాగున్నావు. ధైర్యంగా ఉండు. ట్రీట్‌మెంట్ తీసుకుని కోలుకో. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. త్వరలోనే కలుద్దాం. ‘దేవర’ సినిమాను ఇద్దరం కలసి చూద్దాం. ట్రీట్‌మెంట్ ఖర్చులకు సాయపడతాను’’ అని ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. అలాగే కౌశిక్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆ వీడియో కాల్‌లో కౌశిక్ మాట్లాడుతూ ‘‘అన్నా. మిమ్మిల్ని అస్సలు అనుకోలేదు’’ అని అన్నారు. దానికి బదులుగా ఎన్టీఆర్ ‘‘భలే వాడివే. నీతో మాట్లాడకుంటే ఎలా’’ అని అన్నారు. ఇటీవలే కౌశిక్ తల్లి ఓ వీడియో ద్వారా కుమారుడి ఆరోగ్య పరిస్థితి, జూనియర్ ఎన్టీఆర్ పట్ల తన కుమారుడికి ఉన్న అభిమానాన్ని తెలిపారు.
దీంతో స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, తిరుపతికి చెందిన తమ అభిమానసంఘం కన్వీనర్ కృష్ణయాదవ్‌ను బెంగళూరుకు పంపించారు. తనతో మాట్లాడించాలని సూచించారు. దీంతో కృష్ణయాదవ్‌తో పాటు అభిమానసంఘం కన్వీనర్‌లు మాణిక్యం, బసవ కిద్వాయ్ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి)