నిజాలు తెలుసుకొని వార్తలు రాయండి

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:35 AM

ఇక నుంచి మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా సంస్థలు చిత్ర పరిశ్రమను ఇబ్బందిపెట్టేలా ఇష్టం వచ్చిన రాతలు రాస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర...

నిజాలు తెలుసుకొని వార్తలు రాయండి

  • మిడిమిడి జ్ఞానంతో వార్తలు రాసి చిత్రపరిశ్రమను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవు

  • అసత్యాలను ప్రచారం చేసే పాత్రికేయులపై చర్యలు తీసుకోవాలని మీడియా సంస్థలను కోరిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి

ఇక నుంచి మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా సంస్థలు చిత్ర పరిశ్రమను ఇబ్బందిపెట్టేలా ఇష్టం వచ్చిన రాతలు రాస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా హెచ్చరించాయి. ఈ మేరకు మంగళవారం ఆ మూడు సంస్థలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. నిజాలను నిర్భయంగా ప్రచారంలో పెట్టవచ్చు కానీ అసత్యాలు, ఈర్ష్య ద్వేషాలతో వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయడం సరైనది కాదని లేఖలో మీడియా సంస్థలకు హితవు పలికాయి. కొన్ని వెబ్‌సైట్లు, డిజిటల్‌ మీడియా సంస్థలు సంక్రాంతి టైంలో వాళ్ల రేటింగ్స్‌ కోసం అదేపనిగా తమకు నచ్చినట్లు వార్తలు రాయడం వల్ల హీరోలు, దర్శకులు వారి అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు, కాబట్టి ఇక నుంచి ఏ మీడియా సంస్థ అయినా వార్తలు ప్రచురించేముందు మా మూడు సంస్థలను సంప్రదించి నిజాలు తెలుసుకోవాలని కోరాయి. సినీ ప్రముఖులు మాట్లాడేటప్పుడు పూర్తిగా అవగతం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో పరిశ్రమ ఇబ్బందిపడేలా వార్తలు రాయడం విచారకరం అని పేర్కొన్నాయి. సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఆహ్లాదకరంగా ఉండాలనీ, తెలుగు సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలు... ఎవరూ నష్టపోకూడదనీ మా మూడు సంస్థలు కలసి కృషి చేస్తుంటే సహకరించాల్సింది పోయి మీడియా సంస్థలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించాయి. తెలుగు సినీ పరిశ్రమకు పుట్టుక నుంచి మీడియాతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందికర వ్యాఖ్యలు చేసేవారిపైన తగు చర్యలు తీసుకోవాలని సినీ పాత్రికేయ సంఘాలు, మీడియా యాజమాన్యాలను లేఖలో అభ్యర్థించాయి. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు వివాదంపై ఆ సంస్థల గౌరవ కార్యదర్శులు కే.ఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌, కే అనుపమ్‌రెడ్డి, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రకటనలో స్పందిస్తూ ‘గతంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి, నిర్మాతలను పిలిచి సహకరించమని కోరాము. మా వినతిని మన్నించి, ‘ఈగల్‌’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేసుకున్నారు. తద్వారా మిగతా నాలుగు సినిమాలకు సహకరించినందుకు ఆ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, హీరో రవితేజకు ధన్యవాదాలు. అలాగే రజనీకాంత్‌ ‘ లాల్‌సలామ్‌’, ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ శివ కార్తికేయన్‌ ‘అయలాన్‌’ చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేసేందుకు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jan 10 , 2024 | 03:35 AM