Key Changes in National Film Awards : జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కీలక మార్పులు
ABN , Publish Date - Feb 14 , 2024 | 06:15 AM
ప్రతిభ ప్రదర్శించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, ఉత్తమ విలువలు కలిగిన చిత్రాలను ఎంపిక చేసి ప్రతి ఏటా ఇచ్చే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి...

ప్రతిభ ప్రదర్శించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, ఉత్తమ విలువలు కలిగిన చిత్రాలను ఎంపిక చేసి ప్రతి ఏటా ఇచ్చే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఇచ్చే ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ అవార్డ్‌ను ఇకపై ఆ పేరుతో కాకుండా ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ పేరుతో ఇస్తారు. అంటే అందులో ఉన్న ‘ఇందిరాగాంధీ’ పేరు తొలిగించారన్న మాట. ఈ విభాగంలో దర్శకుడితో పాటు నిర్మాతకు కూడా ప్రైజ్ మనీ ఇచ్చేవారు. ఇకపై దర్శకుడికి మాత్రమే ప్రైజ్ మనీ ఇస్తారు.
అలాగే బాలీవుడ్ నటి నర్గిస్ పేరు మీద జాతీయ సమైకత్యను పెంపొందించే చిత్రానికి ఓ అవార్డ్ ఇస్తున్నారు. ఇకపై ఆ అవార్డులో నర్గిస్ పేరు కూడా ఉండదు. ‘జాతీయ, సామాజిక, పర్యావణ విలువలు పెంపొందించే ఉత్తమ చిత్రం’ పేరుతో ఆ అవార్డ్ అందజేస్తారు.
కేంద్ర సమాచార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ నేతృత్వంలోని కమిటీ సమావేశమై జాతీయ చలనచిత్ర అవార్డులలో కీలక మార్పులు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూన్ జోషి, సినీ ప్రముఖులు ప్రియదర్శన్, విపుల్ షా, ఛాయాగ్రాహకుడు నల్లముత్తు కూడా ఉన్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులు 2022 కోసం ఎంట్రీలు స్వీకరించడానికి జనవరి 30తో గడువు ముగియడంతో ఈ కమిటీ సమావేశమై పలు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడైన దర్శకుడు ప్రియదర్శన్ ధ్రువీకరించారు. ‘నేను కూడా కొన్ని సూచనలు చేశాను. సౌండ్ విభాగానికి కూడా అవార్డులు ఇవ్వాలన్నది వాటిలో ఒకటి’ అని ఆయన వెల్లడించారు.
కీలక మార్పులు ఇవే
చలనచిత్ర పరిశ్రమకు ఇతోధిక సేవలు అందించిన చలనచిత్ర ప్రముఖులకు ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌కు ఇంతవరకూ రూ పది లక్షలు నగదు ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ 15 లక్షలకు పెంచారు.
స్వర్ణకమలం అవార్డ్ పొందిన వారికి ఇకపై రూ. మూడు లక్షలు, రజిత కమలం పొందిన వారికి రూ రెండు లక్షలు అందజేస్తారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ తొలి చిత్రం, పూర్తి వినోదాత్మక చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ బాలల చిత్రం .. విభాగాలకు స్వర్ణ కమలం అందిస్తారు. ఇక మిగిలిన అన్ని విభాగాలు.. అంటే ఉత్తమ ప్రభోదాత్మక చిత్రం, నటనా విభాగంలో వచ్చే అవార్డులు, ఉత్తమ స్ర్కీన్‌ప్లే, ఉత్తమ సంగీత దర్శకుడు.. ఇలాంటి అన్ని అవార్డులకు రజిత కమలం అందిస్తారు.
ఇప్పటివరకూ బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్’, ‘బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్’ అంటూ విడివిడిగా అవార్డులు ఇస్తున్నారు. ఇకపై ఈ రెంటినీ కలిపేసి ‘బెస్ట్ ఎవిజీసీ’(యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) పేరుతో అవార్డులు ఇస్తారు.
బెస్ట్ ఆడియోగ్రఫీ విభాగంలో మూడు సబ్ కేటగిరిలు ఉన్నాయి. ‘సౌండ్ రికార్డిస్ట్’, ‘సౌండ్ డిజైనర్’, ‘ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్ రికార్డిస్ట్’ అని. ఇకపై ఇవన్నీ కలిపి ‘బెస్ట్ సౌండ్ డిజైనర్’ పేరుతో అవార్డ్ ఇస్తారు. ప్రైజ్ మనీని కూడా యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచారు.
ఉత్తమ సంగీత దర్శకుడు పేరుతో ఇచ్చే అవార్డ్‌ను ఇకపై ‘ ఉత్తమ నేపథ్య సంగీతం’ పేరుతో ఇవ్వనున్నారు.
ప్రత్యేక జ్యూరీ అవార్డ్‌ను తొలగించి ఆ స్థానంలో ఫీచర్ ఫిల్మ్‌కు ఒక అవార్డ్, నాన్ ఫీచర్ ఫిల్మ్‌కు ఒక అవార్డ్ ను ఇచ్చే అదికారాన్ని జ్యూరీకి ఇచ్చారు
నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇచ్చే కొన్ని అవార్డులు తొలిగించారు. మరికొన్ని కలిపేశారు. ‘బెస్ట్ స్ర్కిప్ట్’ పేరుతో కొత్తగా ఒక అవార్డును ఏర్పాటు చేశారు.