మోహన్ బాబు పుట్టినరోజు స్పెషల్, ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:38 PM

మంచు విష్ణు 'కన్నప్ప' గురించి సినిమాగా వెండితెరపైన చూపించటమే కాకుండా, కన్నప్ప గురించి అందరికీ తెలియాలని అతని జీవిత చరిత్రని కామిక్ రూపంలో ఒక బుక్ ప్రింట్ చేశారు. ఈ కామిక్ పుస్తకాన్ని మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

మోహన్ బాబు పుట్టినరోజు స్పెషల్, ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల
The story of Kannappa in comics, a comic book released on the occasion of Mohan Babu birthday

మోహన్ బాబు పుట్టినరోజు స్పెషల్, ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదలవిష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను న్యూజిలాండ్ లో ఇటీవలె పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. మళ్ళీ షూటింగ్ ప్రారంభించే ముందు మంచు విష్ణు తన తండ్రి విలక్షణ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చేశారు. వెండితెర మీద తాను కన్నప్ప కథని ఆవిష్కరిస్తే, ఆ కథని అందరికీ తెలపాలని, ముఖ్యంగా పిల్లలకి కన్నప్ప గురించి వివరించాలని, కన్నప్పపై ఒక కామిక్ పుస్తకం తీసుకొచ్చారు. తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న 'కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1' ని ఆవిష్కరించారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

mohanbabukannappa.jpg

'కన్నప్ప కామిక్ బుక్ వాల్యూమ్ 1' ద్వారా భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలుస్తాయి. ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక భావనలను చూపించనున్నారు. ఈ కామిక్ పుస్తకంతో విష్ణు మంచు భక్త కన్నప్ప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంస్కృతిక వారసత్వంతో వినోదాన్ని మిళితం చేయడం ద్వారా, కన్నప్పపై ఆసక్తిని రేకెత్తించడానికి, కన్నప్ప పట్ల భక్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించారు.

kannappacomicbook.jpg

'కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1' విడుదల అనేది భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మాత్రమే కాకుండా, కన్నప్ప కథపై విష్ణు మంచు నిబద్ధతను కూడా ప్రదర్శించింది. ఇన్ స్టాగ్రాంలో DM చేసిన వారికి, వారి చిరునామాను మెసెజ్ చేసిన వారికి ఉచితంగా పుస్తకాలు అందుతాయి. ఈ మేరకు విష్ణు మంచు మాట్లాడుతూ, ‘ఈ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. కామిక్ పుస్తకం, సినిమా లానే ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నాను. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న 'కన్నప్ప' సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ , డ్యాన్స్ మాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

Updated Date - Mar 20 , 2024 | 04:38 PM