కన్నడ నటుడు ద్వారకేశ్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:57 AM

ప్రముఖ కన్నడ నటుడు ద్వారకేశ్‌ (81) కన్నుమూశారు. వయోసహజ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ద్వారకేశ్‌ మంగళవారం ఉదయం తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు...

కన్నడ నటుడు ద్వారకేశ్‌ కన్నుమూత

ప్రముఖ కన్నడ నటుడు ద్వారకేశ్‌ (81) కన్నుమూశారు. వయోసహజ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ద్వారకేశ్‌ మంగళవారం ఉదయం తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు బంగ్లీ షామారావు ద్వారకానాథ్‌. అయితే ‘ద్వారకేశ్‌’ గా చిత్ర పరిశ్రమలో ఆయన సుపరిచితులు. ఆయన 1964లో ‘వీరసంకల్ప’ ద్వారా సినీరంగంలో ప్రవేశించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ సహా ఎందరో ప్రముఖ నటులతో ఆరు దశాబ్దాలపాటు కలసి నటించారు. హాస్యంతోపాటు విభిన్నమైన పాత్రల్లో రాణించారు. 15 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా 50 సినిమాలు నిర్మించారు. ఆయన భార్య అంబుజా సరిగ్గా మూడేళ్లకిందట ఇదే రోజున మృతి చెందారు. ద్వారకేశ్‌కు ఆరుగురు సంతానం. మొదటి భార్యకు ఐదుగురు కుమారులు కాగా రెండో భార్య శైలజకు ఒక కుమారుడు ఉన్నారు. ‘నా చిరకాల మిత్రుడిని కోల్పోయాను’ అంటూ రజనీకాంత్‌ ఎక్స్‌ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ‘స్వశక్తితో ఎదిగిన గొప్ప నిర్మాత, దర్శకుడు ద్వారకానాథ్‌. ఆయన జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. ద్వారకేశ్‌ పార్థివదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. అభిమానుల సందర్శన కోసం రవీంద్రకళాక్షేత్రలో బుధవారం ఆయన పార్థివ దేహాన్ని ఉంచి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - Apr 17 , 2024 | 02:57 AM