మొదట్నుంచే అలా చేసి ఉండాల్సింది

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:20 AM

తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌లు అందుకున్న నటీనటులు ఆ తర్వాత కెరీర్‌ రేస్‌లో వెనుకబడడం తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్‌ కృతిశెట్టి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తన తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే...

మొదట్నుంచే అలా చేసి ఉండాల్సింది

తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌లు అందుకున్న నటీనటులు ఆ తర్వాత కెరీర్‌ రేస్‌లో వెనుకబడడం తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్‌ కృతిశెట్టి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తన తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే అటు ఇండస్ట్రీ, ఇటు తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆమె ఆకట్టుకున్నారు. తెలుగులో అగ్రకథానాయికగా కొనసాగగల సత్తా కృతి సొంతం అని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు ధాటిగానే వచ్చినా, ‘ఉప్పెన’ స్థాయిలో మరో బ్రహ్మండమైన విజయం మాత్రం అందుకోలేక పోయారు. ఇటీవలే శర్వానంద్‌కు జంటగా నటించిన ‘మనమే’ చిత్రం సైతం ఆమెకు మరోసారి నిరాశనే మిగిల్చింది. అయితే వరుస వైఫల్యాలతోనే తెలుగులో హీరోయిన్‌గా కృతి అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే వాదనను ఆమె కొట్టిపారేశారు. తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్లే ఎక్కువ సంఖ్యలో తెలుగు సినిమాలు చేయలేకపోతున్నానని కృతి చెప్పారు. దాంతో పాటు కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించడం కూడా ఓ కారణమన్నారు.


తెలుగులో మంచి కథలు కుదిరినప్పుడే సినిమా చేయాలనుకుంటున్నాననీ, అసలు మొదట్నుంచే కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాల్సిందని వాపోయారు. ‘ఇప్పుడిప్పుడే మన చుట్టూ ఉండే మనుషులు, ప్రపంచం గురించి తెలుసుకుంటున్నాను, గతంలో జరిగిన పొరపాట్లను గుణపాఠాలుగా భావిస్తాను. వైఫల్యాల నుంచి నేర్చుకొని ఇకపై మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను’ అని కృతి అన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 09:33 AM