పురస్కారాలకు పరిష్కారం దొరికేనా?

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:33 AM

అసంతృప్తో, ఆగ్రహమో... ‘గద్దర్‌ పేరుతో సినీ పురస్కారాలు ఇస్తామంటే ముందుకు రారా...’ అంటూ ముఖ్యమంత్రి బహిరంగ వేదికపై నుంచి అన్న ఒక్క మాట తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది...

అసంతృప్తో, ఆగ్రహమో... ‘గద్దర్‌ పేరుతో సినీ పురస్కారాలు ఇస్తామంటే ముందుకు రారా...’ అంటూ ముఖ్యమంత్రి బహిరంగ వేదికపై నుంచి అన్న ఒక్క మాట తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని సంఘాలు ఆయన ఆహ్వానాన్ని పక్కనపెట్టే ధైర్యం చేశాయా? ఏమీ తెలియనట్లే ఉంటూ తలెగరేసే సాహసం సినీ పెద్దలు చేయగలరా? ముఖ్యమంత్రి మాటల్లోని మర్మం ఏమిటి? అనేదే ఇప్పుడు నడుస్తున్న చర్చ.

సినిమావాళ్లు ప్రభుత్వాలకు చేసుకునే వినతులలో భాగంగానే ఇన్నాళ్లూ నంది పురస్కారాల అశం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడమే ఆసక్తిని కలిగిస్తోంది. నేడో రేపు ఫిల్మ్‌ అవార్డ్స్‌ గురించి నోటిఫికేషన్‌ వస్తుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరో పక్క ఈ అవార్డుల గురించి చర్చించేందుకు మేం ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించాం, కానీ వీలు కాలేదు అనే మాట కొంతమంది సినిమా పెద్దల చెబుతున్నారు.


సినిమా పండుగలా పురస్కారాల వేడుక

నంది పురస్కారాలను చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. ప్రతి ఏటా ఉగాది నాడు నంది పురస్కారాల ప్రధానోత్సవం ఆనవాయితీగా వస్తోంది. ఆ వేడుకను ఇండస్ట్రీ మొత్తం పండుగలా జరుపుకునేది. అయితే 2014లో తెలంగాణ ఏర్పడ్డాక అప్పటి ప్రభుత్వం నంది పురస్కారాల స్థానే ‘సింహ’ పేరుతో కొత్తగా పురస్కారాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నామినేషన్లను సైతం స్వీకరించింది. కానీ దశాబ్ద కాలంలో సినీ ప్రముఖులు ఎన్ని విన్నపాలు చేసినా అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకనో సినీ పురస్కారాలపై ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నంది పురస్కారాలను ఇచ్చే సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించాలంటూ పలు వేదికలపై నుంచి చిత్ర పరిశ్రమ తరపున సినీ సంఘాలు, కొంతమంది సినీ ప్రముఖులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. జనవరిలో ప్రజా గాయకుడు గద్దర్‌ సంస్మరణ సభలో ‘గద్దర్‌ అవార్డ్స్‌’ పేరుతో సినీ పురస్కారాలను ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దీని అమలుపై అభిప్రాయాలు, సలహాలు అందించాలని చిత్ర పరిశ్రమ పెద్దలను కోరారు. సినీ ప్రముఖులు సైతం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అభినందించి, మద్దతు తెలిపారు. తర్వాత మాత్రం ఎలాంటి కదలికా లేదు. కానీ మంగళవారం నాడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో నంది పురస్కారాల అంశం అనూహ్యంగా తెరపైకి వచ్చింది.


గద్దర్‌ పేరుతో అవార్డులు ఇష్టం లేదా?

ఏకంగా ముఖ్యమంత్రే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసే దాకా పరిస్థితి వచ్చిందంటే చిత్ర పరిశ్రమలోని సంఘాలు, సినీ ప్రముఖులు ఏం చేసుంటారు అనే చర్చ జరుగుతోంది. సినిమావాళ్లు బయటపడలేదు గానీ గద్దర్‌ పేరుతో పురస్కారాలను స్వీకరించడం ఇష్టంలేదనే చర్చ అప్పట్లోనే బహిరంగంగా నడి చింది. ఆ కారణంతోనే సినీ ప్రముఖులు సీఎంను కలసి పురస్కారాల విషయంపై సంప్రదింపులు జరపలేదనే మాట వినిపిస్తోంది. పరిశ్రమ నుంచి ఒక కమిటీగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయకపోవడం అలాంటి అభిప్రాయాలకు ఊతమిచ్చింది. ‘సినిమా వాళ్లే రాలేదు’ అని సీఎం అంటే ‘ముఖ్యమంత్రి అపాయిట్‌మెంట్‌ దొరకలేద’నేది సినీ పెద్దలు మాట. జరిగిందేదో జరిగిపోయింది, సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రి కలసి పురస్కారాల అంశాన్ని ఓ కొలిక్కితేవాలనేదే ఇప్పుడు పరిశ్రమ ఆకాంక్ష.


స్వయంగా పిలిచినా స్పందించలేదు

నంది పురస్కారాలకు మల్లే తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను ఇవ్వాలనుకుంటోంది. నా అంతట నేనే అడిగినా, ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది సరికాదు. పురస్కారాల విషయంలో సినీ పరిశ్రమ మౌనంగా ఉంటోంది. గద్దర్‌ జయంతి సందర్భంగా డిసెంబర్‌ 9న సినీ పురస్కారాలను ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలో చెప్పాను. ఈ విషయాన్ని మరోసారి తెలుగు పరిశ్రమకు గుర్తు చేస్తున్నాను. మీ విజ్ఞప్తి కంటే ముందే ఒక అడుగు ముందుకేసి ప్రకటన చేశాను. ప్రతిపాదనతో రావాలని పరిశ్రమ వర్గాలను కోరాను. కారణాలేమిటో తెలియదు కానీ సినీ ప్రముఖులు ఇప్పటివరకూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ కృషి, విజయాలకు గౌరవంగా గద్దర్‌ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా పరిశ్రమ పెద్దలు ముందుకు వస్తే అందరం కలసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.

ఏ. రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి


ఆ బాధ్యత ఫిలిం ఛాంబర్‌ తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు చొరవ తీసుకొని సినిమా అవార్డులను పునరుద ్ధరించే నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. ప్రజా కళాకారుడు గద్దర్‌ గారి పేరు మీదుగా, ప్రతి ఏటా ‘గద్దర్‌ అవార్డ్స్‌’ తెలంగాణ ప్రభుత్వం తరపున ఇస్తామని వారు ప్రకటించారు. తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి.

చిరంజీవి

గద్దర్‌ అవార్డ్స్‌పై అభ్యంతరం లేదు

మేం ముఖ్యమంత్రిని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించాం. కానీ సీఎంఓ నుంచి మాకు పిలుపు రాలేదు. అందువల్లే ముఖ్యమంత్రిని కలవలేకపోయాం. గద్దర్‌ పేరుతో అవార్డ్స్‌ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సీఎం ఎప్పుడు పిలిచినా వెళ్లి కలుస్తాం. -

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Updated Date - Jul 31 , 2024 | 01:33 AM