కొరటాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:33 AM

కథల కాపీరైట్స్‌ అంశంపై చిత్రపరిశ్రమలో వివాదాలు తలెత్తడం పరిపాటే. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘గోరింటాకు’(1979) చిత్ర కథ విషయంలోనూ గతంలో ఇటువంటి వివాదమే చోటుచేసుకుంది...

కొరటాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కథల కాపీరైట్స్‌ అంశంపై చిత్రపరిశ్రమలో వివాదాలు తలెత్తడం పరిపాటే. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘గోరింటాకు’(1979) చిత్ర కథ విషయంలోనూ గతంలో ఇటువంటి వివాదమే చోటుచేసుకుంది. కథ నాదేనంటూ రచయిత్రి రంగనాయకమ్మ, ‘గోరింటాకు’ చిత్ర కథారచయిత్రి రామలక్ష్మిపై కోర్టుకు వెళ్లారు. చివరకు ఆ కేసులో రంగనాయకమ్మ విజయం సాధించారు. దాదాపు అలాంటి వివాదమే మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’(2015) సినిమా విషయంలో కూడా ఎనిమిదేళ్లుగా జరుగుతోంది. ‘శ్రీమంతుడు’ కథ తనదేనని, స్వాతి పత్రికలో ప్రచురితమైన తన కథను కాపీ చేసి ‘శ్రీమంతుడు’ సినిమా తీశారని శరత్‌చంద్ర అనే రచయిత అప్పట్లో సినీరచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు. పరిశ్రమ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. న్యాయం జరిగేలా లేదని మీడియా ముందు కూడా తన గోడును వెల్లబోసుకున్నారు. చివరకు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు కొరటాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. దాంతో కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శరత్‌చంద్ర చూపిన ఆధారాలను నిర్థారిస్తూ రచయితల సంఘం ఇచ్చిన నివేదనకు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, నాంపల్లి కోర్ట్‌ ఉత్తర్వ్యులను సమర్థించడంతో కొరటాలకు సుప్రీంకోర్ట్‌ మెట్లెక్కక తప్పలేదు. ఇప్పుడు అక్కడ కూడా కొరటాలకు చుక్కెదురైంది. కొరటాల శివ దాఖలు చేసిన పిటీషన్‌పై జస్టిస్‌ హృషికేశ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత శరత్‌చంద్ర కోర్టును ఆశ్రయించారని, హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున న్యాయవాదైన వై.ఎ్‌స.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి వాదనలను వినిపించగా, సుప్రీం ధర్మాసనం ఆ వాదనలను తోసిపుచ్చింది. రచయితల సంఘం నివేదిక ఆధారంగానే హైకోర్ట్‌ నిర్ణయం తీసుకుందని, పిటీషనర్‌ కొరటాల పిటీషన్‌ని పరిగణనలోకి తీసుకొని తదుపరి విచారణ జరిపేందుకు కూడా ఏమీ లేదని సుప్రీం స్పష్టం చేసింది. ‘పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటారా? మమ్మల్నే డిస్మిస్‌ చేయమంటారా?’ అని ధర్మాసనం కొరటాల తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించింది. తామే పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటాం అని నిరంజన్‌రెడ్డి చెప్పడంతో సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది.

Updated Date - Jan 30 , 2024 | 05:33 AM