మా అబ్బాయి కోసం బతకాలనుకున్నా

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:17 AM

క్యాన్సర్‌ అనగానే చాలామంది అది కలిగించే శారీరక బాధలు గురించే మాట్లాడతారు. కానీ, అది మానసికంగా కలిగించే నష్టం అపారం. క్యాన్సర్‌ సర్వైవర్‌గా తాను ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పగలనన్నారు నటి సోనాలీ బింద్రే...

క్యాన్సర్‌ అనగానే చాలామంది అది కలిగించే శారీరక బాధలు గురించే మాట్లాడతారు. కానీ, అది మానసికంగా కలిగించే నష్టం అపారం. క్యాన్సర్‌ సర్వైవర్‌గా తాను ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పగలనన్నారు నటి సోనాలీ బింద్రే. జీవీకె హెల్త్‌ హబ్‌ ప్రారంభించిన మేక్‌ యువర్‌ పింక్‌ మార్క్‌ ప్రచారంలో భాగంగా శనివారం జూబ్లీహిల్స్‌లోని సంస్థ ప్రాంగణంలో ఓ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సోనాలీ బింద్రే మాట్లాడుతూ ‘మీకు క్యాన్సర్‌ వచ్చిందని తెలియగానే ఆందోళనకు గురైతే అది మిమ్మల్ని మరింత కుంగదీస్తుంది. అటువంటి సందర్భంలో మానసిక బలం ముఖ్యం. నా విషయానికి వస్తే మానసికంగా బలంగా ఉండడంతో పాటు చిన్న వయసులో ఉన్న మా అబ్బాయి కోసం బతకాలనుకున్నా. కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు పూర్తిగా మద్దతు అందించారు. రోజువారీ ధ్యానం, యోగా, చిన్న చిన్న విజయాల ద్వారా అవసరమైన మానసిక స్థైర్యం సంపాదించుకున్నా’ అని చెప్పారు. ‘క్యాన్సర్‌ అనే పదమే భయంకరమైనది.


దాని బారిన పడితే ఇక జీవితం ముగిసినట్లే అన్నది వాస్తవం కాదు. మనం ముందు వ్యాధిని గుర్తిస్తే, చికిత్స ద్వారా క్యాన్సర్‌ను జయించవచ్చు. మనలో చాలామంది ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి వైద్య పరీక్షలు అవసరం లేదనుకుంటారు. రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటే, ఈ తరహా సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్సలను పొందవచ్చు. మగవారంతా కూడా ఇళ్లలోని తమ ఆడవారికి పరీక్షలు చేయించాలి’ అని కోరారు సోనాలి.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 20 , 2024 | 02:17 AM