నా దేశం కోసం ‘రజాకార్’ తీశా
ABN , Publish Date - Mar 13 , 2024 | 03:39 AM
‘నా శేషజీవితంలో ఏదో ఒక మంచి పని చేయాలి. చరిత్రలో నిలిచిపోవాలి. చరిత్రను సినిమాగా తీసి ఈ సమాజానికి తెలియజేయాలని అనుకున్నా. అందుకే హై క్వాలిటీతో రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ‘రజాకార్’ సినిమా తీశా...
గూడూరు నారాయణరెడ్డి
‘నా శేషజీవితంలో ఏదో ఒక మంచి పని చేయాలి. చరిత్రలో నిలిచిపోవాలి. చరిత్రను సినిమాగా తీసి ఈ సమాజానికి తెలియజేయాలని అనుకున్నా. అందుకే హై క్వాలిటీతో రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ‘రజాకార్’ సినిమా తీశా. నా దేశం కోసం, దేశప్రజల కోసం ఈ సినిమా తీశా’ అన్నారు గూడూరు నారాయణరెడ్డి. ఆయన నిర్మించిన ‘రజాకార్’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడిస్తూ ‘ రెండేళ్ల క్రితం నేను తిరుపతిలో ఉన్నప్పుడు నాకు ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. నా ఇష్ట దైవం వేంకటేశ్వరుడు ఈ సినిమా తీయమని నాతో చెప్పాడనిపించింది. వెంటనే దర్శకుడు యాటా సత్యనారాయణకు ఫోన్ చేశా. రజాకార్లు మళ్లీ పుట్టొద్దు అనే కారణంతోనే ఈ సినిమా నిర్మించాను. నాకు ఏ మతం మీద వ్యతిరేకత లేదు. ముస్లింలకు వ్యతిరేకిని కాను. ఏడవ నిజాంను మాత్రం వ్యతిరేకిస్తా. నా ఆలోచనకు దర్శకుడు సత్యనారాయణ న్యాయం చేశాడు. బడ్జెట్ పెరగడం వల్ల ఇబ్బంది ఎదురైంది కానీ సినిమా బాగా వచ్చింది. తెలంగాణలో పుట్టిన వ్యక్తి తీసిన బెస్ట్ సినిమా ఇదని గట్టిగా చెప్పగలను’ అన్నారు నారాయణరెడ్డి. సినిమాకు హిందీలో కూడా రెస్పాన్స్ బాగుందని ఆయన తెలిపారు.