తెలంగాణ యాస కోసం కష్టపడ్డా

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:13 AM

‘చాలా రోజుల తర్వాత నా మనసుకు నచ్చిన పాత్ర ‘పొట్టేల్‌’ చిత్రం ద్వారా దొరికింది. ఇందులో పటేల్‌ అనే పాత్ర పోషించాను. చాలా షేడ్స్‌ ఉన్నాయి. అందుకే కథ వినగానే ఈ సినిమా తప్పకుండా చేయాలని...

‘చాలా రోజుల తర్వాత నా మనసుకు నచ్చిన పాత్ర ‘పొట్టేల్‌’ చిత్రం ద్వారా దొరికింది. ఇందులో పటేల్‌ అనే పాత్ర పోషించాను. చాలా షేడ్స్‌ ఉన్నాయి. అందుకే కథ వినగానే ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని నటుడు అజయ్‌ అన్నారు. యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించగా, సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్‌ సడిగె నిర్మించారు. ఈ నెల 25న విడుదలవుతున్న సందర్భంగా అజయ్‌ మీడియాతో ముచ్చటించారు. ‘కథలో కీలకమైన పాత్ర కావడంతో బాగా చేయకపోతే సినిమా దెబ్బతింటుందనే భయం ఏర్పడింది. ఈ సినిమాకు కథ, నా పాత్ర అద్భుతంగా కుదిరాయి. సాహిత్‌ కథను ఎంత అద్భుతంగా చెప్పాడో, సినిమాను అంతే అద్భుతంగా తెరకెక్కించాడు. కథలో సందేశం పాలు ఎక్కువ ఉన్నా దానికి వాణిజ్య హంగులు అద్దిన తీరు మెప్పిస్తుంది.


తెలంగాణ యాసలో సంభాషణలు పలకడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. విజిల్స్‌ పడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. విక్రమార్కుడులో నేను పోషించిన విలన్‌ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆ స్థాయి విలనిజం పండించే పాత్ర ఇప్పటివరకూ మళ్లీ దక్కలేదు. ఈ సినిమా ఆ లోటు తీరుస్తుంది’ అని చెప్పారు.

Updated Date - Oct 20 , 2024 | 02:13 AM