ఆ అవకాశం నేను ఇంతవరకూ ఇవ్వలేదు

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:57 AM

‘‘క్రాక్‌’ సినిమా చేయడానికి ముందే ‘శబరి’ కథ విన్నా. నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. కానీ షూటింగ్‌ మొదలు కావడానికి చాలా సమయం పట్టింది. నా మీద నమ్మకంతో ఫిమేల్‌ ఓరియంటెడ్‌ చిత్రం...

ఆ అవకాశం నేను ఇంతవరకూ ఇవ్వలేదు

‘‘క్రాక్‌’ సినిమా చేయడానికి ముందే ‘శబరి’ కథ విన్నా. నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. కానీ షూటింగ్‌ మొదలు కావడానికి చాలా సమయం పట్టింది. నా మీద నమ్మకంతో ఫిమేల్‌ ఓరియంటెడ్‌ చిత్రం చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. అందరికీ నచ్చుతుంది’ అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్‌.

ఆమె నటించిన ‘శబరి’ చిత్రం మే 3న విడుదల కానుంది. ఈ సందర్బంగా బుధవారం మీడియాతో ముచ్చటించారు వరలక్ష్మి.


  • ఈ సినిమా చేయడం రిస్క్‌ అనిపించలేదా అని అడిగితే ‘లైఫే రిస్క్‌. హిట్టు, ప్లాపుల్ని ఎవరూ జడ్జ్‌ చేయలేరు. ‘హను-మాన్‌’ చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్‌ అయింది. ‘నాంది’, ‘కోట బొమ్మాళి’ సినిమాలు హిట్‌ అవుతాయని ఊహించలేదు. ‘శబరి’ విషయానికి వస్తే.. ఒక డిఫరెంట్‌ ఫిల్మ్‌ చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు వరలక్ష్మి.

  • ‘శబరి’లో తన పాత్ర గురించి వివరిస్తూ ‘ఒక సాధారణ అమ్మాయి కథ. భర్తతో సమస్యల వల్ల అతనికి దూరం జరిగి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. కూతుర్ని కాపాడుకోవడానికి ఆ తల్లి ఏం చేసిందనేది కథ. తల్లీ కూతుళ్ల అనుబంధం సినిమాలో హైలైట్‌గా ఉంటుంది.’ అని తెలిపారు.

  • హిట్టు, ప్లాపులు తన చేతిలో లేవని చెబుతూ ‘ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనీ, వారికి నచ్చే విధంగా నటించాలి అనే ప్రెజర్‌ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు నా నటన బాగోలేదని అనుకోకూడదనే నా తపన’ అన్నారామె.

  • తన కాబోయే భర్త నికోలయ్‌ గురించి చెబుతూ ‘నా నటన బాగోక పోతే బాగోలేదని చెబుతారు. బాగుందంటే మెచ్చుకుంటారు. అయితే బాగోలేదని ఆయన చెప్పే అవకాశం నేను ఇంతవరకూ ఇవ్వలేదు’ అన్నారు వరలక్ష్మీ. తన వివాహం ఈ ఏడాదే ఉంటుందని తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 05:57 AM