ఓ మంచి సినిమా మీకు ఇవ్వబోతున్నా

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:48 AM

‘క’ అనే ఒకే ఒక్క పదం టైటిల్‌తో హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న చిత్రం ట్రేడ్‌లో ఇప్పుడు ఆసక్తిగా మారింది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు...

‘క’ అనే ఒకే ఒక్క పదం టైటిల్‌తో హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న చిత్రం ట్రేడ్‌లో ఇప్పుడు ఆసక్తిగా మారింది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం త్వరలో తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘మూడు ‘క’ లను నమ్ముకుని ఈ ‘క’ చిత్రం తీశాను. మొదటి క.. కథ. చాలా కథలు విని విభిన్నంగా ఉన్న ఈ చిత్రకథను ఎన్నుకున్నాం. రెండో క.. కిరణ్‌ అబ్బవరం., మూడో క.. కల. ఒక మంచి సినిమా తీసి పదిమందికి తోడుగా ఉండాలన్నది నా కల, అది ఈ సినిమాతో నెరవేరుతోంది. దర్శకులుగా పరిచయమవుతున్న సందీప్‌, సుజిత్‌ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంటారు’ అని తెలిపారు.


‘ఎటువంటి కథనైనా తెర పైకి తీసుకురావడానికి ధైర్యం కావాలి. కిరణ్‌ మాకు సపోర్ట్‌ ఇచ్చారు. మంచి టీమ్‌ను ఇచ్చారు. కొత్త డైరెక్టర్స్‌కు అలాంటి టీమ్‌ దొరకడం అదృష్టమే’ అన్నారు దర్శకుల్లో ఒకరైన సుజిత్‌. మరో దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ ‘ఎంతో రిసెర్చ్‌ చేసి, 80ల కాలం నాటి వస్తువులను సేకరించి, హై స్టాండర్డ్స్‌లో ఈ సినిమా తీశాం. ఫ్యామిలీ వాతావరణాన్ని క్రియేట్‌ చేసి మేం టెన్షన్‌ లేకుండా పని చేసే అవకాశాన్ని కిరణ్‌ కల్పించారు. ‘క’ అంటే కిరణ్‌ అబ్బవరం కాదు.. ఇందులో ఒక ప్రధాన పాత్ర ఉంది. అదేమిటో థియేటర్లలోనే చూడాలి’ అన్నారు.


హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘ ‘వీడి పని అయిపోయంది’ అని ఎవరైనా అంటే నమ్మకండి. మన పని అయిందా లేదా అనేది మనకు మాత్రమే తెలుసు. అలాగే నా పని అయిపోయిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. అలా అనిపించినప్పుడు సినిమాలు చేయను. ‘క’ సినిమా మొదలై ఏడాదిన్నర అయింది. ఒక మంచి సినిమా కోసం మేమంతా కష్టపడ్డాం. ఒక మంచి సినిమాను మళ్లీ మీకు ఇవ్వబోతున్నా. మీ ప్రేమను పొందడానికి ఎదురు చూస్తున్నా. ‘క’ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా రహస్య చూసుకుంది. సినిమా రీచ్‌ అయ్యాక మాట్లాడతా అని చెప్పింది. అందుకే ఇక్కడికి రాలేదు’ అన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 04:48 AM