Controversy: పవన్ కల్యాణ్ గారికి మాట రాకూడదనే వివరణ ఇస్తున్నాను: జానీ మాస్టర్

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:49 PM

జానీ మాస్టర్ తనపై సతీష్ అనే డాన్సర్ చేసిన ఆరోపణలకు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చాడు. కేవలం పవన్ కళ్యాణ్ మాట రాకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెప్పాడు. సతీష్ ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా, సతీష్ అనే అతను అసోసియేషన్ లో ఎంతటి దురుసుగా ప్రవర్తించాడో కూడా చెప్పాడు జానీ మాస్టర్. సతీష్ ఆరోపణలు నిజమని రుజువైతే తాను కోరియోగ్రఫీ వదులుకుంటాను అని కూడా చెప్పాడు జానీ మాస్టర్.

Controversy: పవన్ కల్యాణ్ గారికి మాట రాకూడదనే వివరణ ఇస్తున్నాను: జానీ మాస్టర్
Jani Master

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై డాన్సర్ సతీష్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకి పని లేకుండా చెయ్యడానికి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అందరికీ చెపుతున్నాడని, తనకి పని లేకుండా పోయిందని, తనకి జీవనం లేకుండా చెయ్యడానికి జానీ మాస్టర్ ప్రయత్నం చేస్తున్నాడని ఇలా ఆరోపణలు చేసాడు సతీష్. అలాగే జానీ మాస్టర్ పై సతీష్ రాయ్ దుర్గం పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు, కానీ ఎఫ్ఐఆర్ రాయలేదు,ఎందుకంటే ఇద్దరూ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. అయితే ఈరోజు జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణలకు ఒక మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చాడు.

జానీ మాస్టర్ తెలుగు టీవీ డాన్సర్స్, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా వున్నాడు. ఇప్పుడు ఆ హోదాలోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెపుతూ, ఆ హోదాలో మాట్లాడుతున్నాను అని చెప్పాడు. డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కొంత భూమిని కొన్నామని, దానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ ఇబ్బందులను అధిగమించి, ఒక పరిష్కారం రావాలనే వుద్దేశంతో తనకి ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని చెప్పాడు జాన్ మాస్టర్.

janimasterpawankalyan.jpg

అలాగే యూనియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్, ఉపాసన లతో మాట్లాడామని, అది ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది అని చెప్పాడు జానీ మాస్టర్. యూనియన్ లో మాట్లాడిన విషయాలను ఎప్పుడూ ఇంటర్నల్ గా ఉంచాలి గానీ, బయటకి చెప్పకూడదు అని ఒక నియమం వుంది. కానీ సతీష్ అనే అతను తన స్టేటస్ గా పెట్టడం జరిగింది. అప్పుడు ఆలా చెయ్యకూడదు, అది తీసెయ్యమని అతన్ని అడిగాము. దానికి అతను చాలా దుర్బాషలాడారని చెప్పారు జానీ. అదే విషయం యూనియన్ లో చర్చిస్తే సతీష్ తన తప్పుని ఒప్పుకోవటం కూడా జరిగిందని చెప్పాడు జానీ మాస్టర్.

అప్పుడు యూనియన్ నిబంధనల ప్రకారం సతీష్ కి జరిమానా విధించటం జరిగింది. అంతకముందు సతీష్ కమిటీలో వున్నాడు, ఎవరు తప్పు చేసిన జరిమానా కట్టాలని వాదించాడు. అలా వాదించిన సతీష్ ఇప్పుడు తానేంటో చూపిస్తా అని బెదిరించాడు. తానొక నక్సలైట్ నని, తుపాకీ ఉందని సతీష్ బెదిరింపులు చేశాడు. యూనియన్ నిబంధనలు ఫాలో అవ్వమని సతీష్ కి చెపితే, అవి తప్ప ఏవేవో చేస్తున్నాడు.

ఇప్పుడు నేను ఇలా మీడియా ముందుకు నాపైన వచ్చిన ఆరోపణలకి సమాధానం ఎందుకు ఇస్తున్నాను అంటే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి ఇబ్బంది కాకూడదు అని. ఎందుకంటే నేను అతని పార్టీకి సపోర్ట్ గా ఉన్నాను కాబట్టి, ఇప్పడు ఈ వివరణ ఇస్తున్నాను అని చెప్పాడు జానీ మాస్టర్. నాపై సతీష్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, నేను నా పదవికి రాజీనామా చేస్తాను, అలాగే కొరియోగ్రాఫీ కూడా వదిలేస్తాను అని చెప్పాడు జానీ.

తను మొదటి నుండీ డాన్సర్స్ కు అన్నీ విధాలుగా సపోర్ట్ గా ఉండే వ్యక్తినని, కొరియోగ్రాఫర్ కమీషన్ కూడా నేను తీసుకొకుండా అసోసియేషన్ కే ఇస్తున్నాను అని చెప్పాడు. అలాగే 'పుష్ప 2', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాల కొరియోగ్రఫీ చేసేటప్పుడు మన డాన్సర్స్ కే ఎక్కువ అవకాశాలకు ఇవ్వటం జరిగింది అని చెప్పాడు. సతీష్ వర్క్ మేము ఎవరమూ ఆపలేదు, పైగా అతను పెమెంట్ తాను అసోసియేషన్ నుంచి కాకుండా తన పర్సనల్ ఎకౌంట్ లో‌ వేయించుకున్నాడు.

janimasterpluspawan.jpg

అలాగే అతని మెంబర్ షిప్ కూడా అసోసియేషన్ నుండి తీయలేదు, కానీ అసోసియేషన్ సపోర్ట్ లేకుండా అతను వర్క్ చేసుకోవచ్చని అతనికి చెప్పటం జరిగింది, అందువలన సతీష్ పని లేకుండా లేడు, పని చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు రాకేష్ మాస్టర్ ను కూడా గతంలో సతీష్ బాగా ఇబ్బంది పెట్టాడు, రాకేష్ మాస్టర్ కార్డ్ ను అసోసియేషన్ నుంచి సతీష్ తీయించాడు. అందరికీ రూల్స్ అంటూ చెపుతూ ఉంటాడు సతీష్, కానీ అతను మాత్రం ఆ రూల్స్ ఫాలో అవడు అని సతీష్ గురించి చెప్పాడు జానీ మాస్టర్.

అలాగే అసోసియేషన్ కి సతీష్ వలన నష్టం ఎలా వచ్చింది కూడా వివరించాడు జానీ మాస్టర్. గతంలో మా అసోసియేషన్ ఒక ల్యాండ్ కొన్నప్పుడు కనీసం ఎటువంటి ఫ్రూఫ్ లేకుండా 30 లక్షల డబ్బులు ఇచ్చారని, ఆ తరువాత ఆ డబ్బులు వాపస్ తీసుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దాని వల్ల 5 లక్షల లాస్ కూడా అసోసియేషన్ కు ఏర్పడింది అని చెప్పారు.

సతీష్ నాపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేశారు, అలాగే నా పరువుకి భంగం‌ కలిగించారు. కానీ నేను క్షమించి వదిలేస్తాను, అతనిపై న్యాయపరంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకునే ఉద్దేశం నాకు లేదు అని చెప్పాడు జానీ మాస్టర్.

Updated Date - Jun 24 , 2024 | 02:23 PM