బాక్సాఫీస్‌కు హారర్‌ జోరు

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:25 AM

కొన్నేళ్లుగా బాలీవుడ్‌ బాక్సాఫీసు.. థియేటర్లు సరైన హిట్లు లేక వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో నేనున్నానంటూ బాలీవుడ్‌ను ఆదుకున్నాయి కొన్ని సినిమాలు. విచిత్రమేమిటంటే అందులో...

కొన్నేళ్లుగా బాలీవుడ్‌ బాక్సాఫీసు.. థియేటర్లు సరైన హిట్లు లేక వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో నేనున్నానంటూ బాలీవుడ్‌ను ఆదుకున్నాయి కొన్ని సినిమాలు. విచిత్రమేమిటంటే అందులో అధిక శాతం ‘హారర్‌’ జానర్‌కు చెందిన చిత్రాలే. అలా ఈ ఏడాది బాక్సాఫీస్‌కు కళ తెచ్చిన తెచ్చిన హారర్‌ చిత్రాలేంటో.. అలాగే త్వరలో ప్రేక్షకులను పలకరించే చిత్రాలేంటో చూద్దాం.

ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన చిత్రం ‘ముంజ్య’. ఆదిత్య సర్పోత్థార్‌ దర్శకత్వంలో అభయ్‌ వర్మ, శర్వారీ, మోనా సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో జూన్‌ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో తన ప్రేయసిని ముంజ్యా (బ్రహ్మ రాక్షసుడు) నుంచి కాపాడుకునేందుకు హీరో పడే పాట్లు.. చేసే ఫీట్లు అందర్నీ తెగ నవ్వించాయి. పిల్లలను నిద్రపుచ్చడానికి పెద్దలు చెప్పే జానపద కథలా.. కామెడీ హారర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలై విడుదలై అందరినీ అలరిస్తోంది.


వసూళ్ల వర్షం

శ్రద్ధాకపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌ నేచురల్‌ హారర్‌ కామెడీ ‘స్త్రీ 2’. ఇది 2018లో తెరకెక్కి సూపర్‌ హిట్‌ సాధించిన ‘స్త్రీ’ సినిమాకు సీక్వెల్‌. రాజ్‌కుమార్‌ రావు కథానాయకుడు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించి.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు రూ.530 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో ‘ఫైటర్‌’, ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్రాలు సాధించిన కలెక్షన్లను అధిగమించింది. అంతేకాకుండా షారుక్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రం ఇండియాలో సాధించిన లైఫ్‌టైమ్‌ కలెక్షన్లను దాటేసి.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో హిందీ మూవీగా ‘స్త్రీ 2’ నిలిచింది. ఈ కలెక్షన్ల పరంపర ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇది ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక కలెక్షన్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ సినిమాను దాటేస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక, ఈ సినిమా కథాంశానికి వస్తే.. చండేరి అనే ఓ ఊరిలో హఠాత్తుగా మహిళలు కనిపించకుండా పోవడం, వారిని కాపాడడం కోసం రాజ్‌కుమార్‌ రావు, తన స్నేహితులతో చేసే పనులు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ.. ప్రేక్షకులకు సూపర్‌ థ్రిల్‌ను పంచాయి. అలాగే, ఈ సినిమాకు తమన్నా చేసిన ప్రత్యేక గీతం కూడా కలిసొచ్చింది. ఇప్పటివరకూ దేశంలో తెరకెక్కిన లేడీ ఓరియెంట్‌డ్‌ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు మూడో భాగం ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది.


మూడు రెట్ల లాభాలు

అజయ్‌ దేవ్‌గణ్‌, ఆర్‌.మాధవన్‌, జ్యోతిక నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘షైతాన్‌’. వికాశ్‌ భల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. రూ.65 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.200 కోట్లు రాబట్టింది. ఇందులో మాధవన్‌ వశీకరణం మాయలో పడిన తన కూతురిని రక్షించుకోవడం కోసం అజయ్‌దేవ్‌గణ్‌ చేసే పోరాటం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘షైతాన్‌ 2’ని తెరకెక్కించేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు.


త్వరలో మరిన్ని..

‘స్త్రీ 2’ చిత్రం ఊహకు మించిన సక్సెస్‌ సాధించడంతో బాలీవుడ్‌ చూపు ఒక్కసారిగా హారర్‌ ఫ్రాంచైజీలపై పడింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న హారర్‌ చిత్రాల్లో ‘భూత్‌ బంగ్లా’, ‘భేడియా 2’, ‘భూల్‌ భులయ్యా 3’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘భూత్‌ బంగ్లా’ చిత్రం అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా, ప్రియదర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ హారర్‌ కామెడీని అక్షయ్‌కుమార్‌ బర్త్‌డే సందర్భంగా ప్రకటించారు. ‘భేడియా 2’ విషయానికి వస్తే.. ఇది 2022లో వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘భేఢియా’ చిత్రానికి సీక్వెల్‌. కృతి సనన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అమర్‌ కౌశిక్‌ దర్శకుడు. ప్రస్తుతం రెండో భాగం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మరోవైపు, ‘భూల్‌ భులయ్యా 3’ చిత్రంలో కార్తీక్‌ ఆర్యన్‌, విద్యాబాలన్‌, త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు. ఈ సిరీ్‌సలో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టాయి. మూడో భాగం దీపావళి సందర్భంగా నవంబర్‌ 1న విడుదలవుతోంది. వీటిలో ఏ చిత్రాలు ‘స్త్రీ 2’ లాగా సంచలన విజయాలు సాధిస్తాయో అని అందరూ వేచి చూస్తున్నారు.

Updated Date - Sep 11 , 2024 | 06:26 AM