బాలీవుడ్‌లో హీరోలు.. దక్షిణాదిలో విలన్లు

ABN , Publish Date - Sep 17 , 2024 | 05:46 AM

తెలుగు సినిమాల్లో ప్రతినాయక పాత్రలకు పరభాషా విలన్లను ఎంచుకోవటం మేకర్స్‌కు ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే ఆ పరభాషా విలన్ల స్థానంలో ఇప్పుడు ఒకే ఇండస్ట్రీకి చెందిన నటులు ఎక్కువగా కనిపిస్తున్నారు...

తెలుగు సినిమాల్లో ప్రతినాయక పాత్రలకు పరభాషా విలన్లను ఎంచుకోవటం మేకర్స్‌కు ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే ఆ పరభాషా విలన్ల స్థానంలో ఇప్పుడు ఒకే ఇండస్ట్రీకి చెందిన నటులు ఎక్కువగా కనిపిస్తున్నారు. బాలీవుడ్‌లో హీరోలుగా ఉన్న ఎంతో మంది నటులు ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో విలన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా దక్షిణాదిలో విలన్లుగా మారిన వారెవరో ఓ లుక్కేద్దాం.

సైఫ్‌ అలీఖాన్‌

బాలీవుడ్‌లో మంచి హిట్‌ ట్రాక్‌ ఉన్న కథానాయకుల్లో సైఫ్‌ అలీఖాన్‌ ఒకరు. లవర్‌ బాయ్‌ నుంచి యాక్షన్‌ రోల్స్‌ వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన.. ప్రస్తుతం ప్రతినాయకుడిగా మారారు. ఇప్పటికే ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’ చిత్రంలో రావణుడి పాత్రను పోషించారు సైఫ్‌. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర’లో ‘భైర’ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘భైర’ గ్లింప్స్‌, ట్రైలర్‌తో సినిమాలో ఆయన పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో సినీ ప్రియులకు మేకర్స్‌ హింటిచ్చారు.


ఇమ్రాన్‌ హష్మీ

బాలీవుడ్‌లోనే మోస్ట్‌ రొమాంటిక్‌ హీరోల్లో ఇమ్రాన్‌ హష్మీ ఒకరు. సీరియల్‌ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలకు సిద్ధమయ్యారు. సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘దే కాల్‌ హిమ్‌ ఓ.జీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌)లో ఆయన ఓమి భాయ్‌ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఇమ్రాన్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్‌లో ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది.


బాబీ డియోల్‌

ప్రతినాయకుడి అవతారమెత్తిన మరో బాలీవుడ్‌ కథానాయకుడు బాబీ డియోల్‌. ఇప్పటికే ‘యానిమల్‌’ సినిమాలో రణ్‌బీర్‌తో తలపడ్డారు ఆయన. ‘యానిమల్‌’లో కనిపించింది కాసేపు అయినా.. తన నటనతో ప్రేక్షకులకు విలన్‌ అంటే వీడేరా అనే ఫీల్‌ను కలిగించారు బాబీ. అయన ప్రస్తుతం దక్షిణాదిలో విలన్‌గా వరుస అవకాశాలను సొంతం చేసుకున్నారు. తమిళ నటుడు సూర్య నటిస్తున్న ‘కంగువ’లో భీకరమైన పోరాట యోధుడిగా ఆయన కనిపించనున్నారు. అలాగే, కే.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘ఎన్‌బీకే109’ చిత్రంలోనూ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ‘హరిహర వీరమలు’్లలోనూ బాబీడియోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయన మొఘల్‌ ఎంపెరర్‌ ఔరంగజేబ్‌ పాత్రను పోషించడం విశేషం. అలాగే విజయ్‌ నటిస్తున్న నూతన చిత్రంలోనూ ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిసింది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘విజయ్‌ 69’.


సంజయ్‌ దత్‌

దక్షిణాదికి బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ హీరోగానూ.. విలన్‌గానూ ఇప్పటికే సువరిచితం. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా నటించిన ‘కేజీఎఫ్‌’ సిరీ్‌సలో ‘అధీరా’ పాత్రలో కరడుగట్టిన విలన్‌గా ఆయన కనిపించారు. గతేడాది లోకేశ్‌ కనగరాజ్‌, తమిళ నటుడు విజయ్‌ కలయికలో వచ్చిన ‘లియో’లోను ఆయన పోషించిన పాత్ర ప్రతినాయక ఛాయలున్నదే. ఈ మధ్యే రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రంలోనూ ‘బిగ్‌ బుల్‌’గా ఆయన అదరగొట్టారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజా సాబ్‌’లోనూ ఆయన నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ జీవితాన్ని మలుపు తిప్పే ఘోస్ట్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్‌. అయితే ఇది పాజిటివా, నెగెటివా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇక ఇప్పటికే వివేక్‌ ఒబెరాయ్‌ ‘వినయ విధేయ రామ’, ‘వివేకం’ ‘లూసీఫర్‌’లో.. అర్జున్‌ రామ్‌పాల్‌ ‘భగవంత్‌ కేసరి’లో.. అక్షయ్‌కుమార్‌ ‘2.0’ చిత్రాలలో విలన్‌ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

Updated Date - Sep 17 , 2024 | 05:46 AM