ఇకపై థియేటర్లకు పర్సంటేజ్ చెల్లించాల్సిందే
ABN , Publish Date - May 23 , 2024 | 06:21 AM
ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు పర్సంటేజీ చెల్లించాలనీ, ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించమని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు...

ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు పర్సంటేజీ చెల్లించాలనీ, ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించమని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నష్టాలను తట్టుకోలేక . పదేళ్ల కాలంలో దాదాపు రెండు వేల సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మూత పడ్డాయని ఆయన వెల్లడించారు.. బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, పలువురు పంపిణీదారులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌తో సమావేశమై ఎగ్జిబిటర్స్‌కు వాటాలపై కొన్ని ప్రతిపాదనలు తయారు చేశాం. దీనిపై నిర్మాతలకు జులై ఒకటి వరకూ గడువు ఇస్తున్నాం. అయితే ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ఫ 2’, ‘గేమ్ ఛేంజర్’, ‘భారతీయుడు 2’ చిత్రాలకు మినహాయింపు ఇస్తున్నాం. ఇతర సినిమాలను పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తాం. కొంతమంది డిస్ట్రిబూటర్స్ సినిమా వ్యాపారాన్ని జూదంలా మార్చారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద రాజ్, రవీంద్ర గోపాల తదితర సభ్యులు పాల్గొన్నారు.