కల లో కూడా హాని తలపెట్టడు

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:58 AM

‘దర్శన్‌ గురించి నాకు బాగా తెలుసు, ఆయన ఎంతో మందిని ఆదుకున్నాడు. వీలైతే సాయం చేస్తాడే తప్ప కలలో కూడా ఇతరులకు హాని తలపెట్టడు. త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకొస్తాడు’ అని టాలీవుడ్‌ హీరో నాగశౌర్య...

కల లో కూడా హాని తలపెట్టడు

  • అభిమాని హత్యకేసులో అరెస్టయిన హీరో దర్శన్‌కు నాగశౌర్య మద్దతు

‘దర్శన్‌ గురించి నాకు బాగా తెలుసు, ఆయన ఎంతో మందిని ఆదుకున్నాడు. వీలైతే సాయం చేస్తాడే తప్ప కలలో కూడా ఇతరులకు హాని తలపెట్టడు. త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకొస్తాడు’ అని టాలీవుడ్‌ హీరో నాగశౌర్య అన్నారు. రేణుకాస్వామి అనే అభిమానిని క్రూరంగా హత్య చేసిన కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శనకు నాగశౌర్య మద్దతుగా నిలిచాడు.


‘ఎన్నో కుటుంబాలు దర్శన్‌ మీద ఆధారపడి బతుకుతున్నాయి. నిజాలు నిగ్గుతేలేవరకూ ఆయన కుటుంబానికి కాస్త గౌరవం ఇవ్వండి. ముందే విమర్శలకు దిగడం సరికాదు’ అని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లకు హితవు పలికారు. ‘న్యాయవ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి. నిజమైన దోషులకు శిక్ష పడుతుంది. దర్శన్‌ అన్న నిర్దోషిగా బయటకు వస్తాడు. ఈ గడ్డు పరిస్థితుల్లో వారి కుటుంబాన్ని కించపరచడం, బాధపెట్టడం చేయవద్దు’ అని తన పోస్ట్‌లో నాగశౌర్య పేర్కొన్నారు. దర్శన్‌తో దిగిన ఫొటోను ఆయన షేర్‌ చేశారు.


దర్శన్‌ తన భార్య, పిల్లలను వదిలి హీరోయిన్‌ పవిత్రగౌడతో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూన్నారనే కారణంతో రేణుకాస్వామి అనే అభిమాని పవిత్రగౌడకు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడు. ఆ కోపంతో రేణుకా స్వామిని దర్శన్‌ తన అభిమానులతో కిడ్నాప్‌ చేయించి, హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. దర్శన్‌, పవిత్రగౌడను కఠినంగా శిక్షించి, రేణుకాస్వామికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్ణాటక వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో నెటిజన్లు దర్శన్‌ను బండబూతులు తిడుతూ ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగశౌర్య దర్శన్‌కు మద్దతు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టడం చర్చనీయాంశం అయింది.

Updated Date - Jun 29 , 2024 | 03:58 AM