గద్దలకొండ గణేశ్‌లా గుర్తుండిపోతుంది
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:22 AM
‘‘గద్దల కొండ గణేశ్’ చిత్రం విడుదలయ్యాక జనాలు నన్ను ‘వరుణ్’ అని కాకుండా ‘గణేశ్’ అనే పిలిచారు. నటుడిగా నాకది పెద్ద ప్రశంస. పాత్ర పేరుతో మనల్ని పిలిస్తే నటుడిగా వచ్చే సంతృప్తే వేరు. ఒక నటుడికి అంతకంటే ఆనందం...
‘‘గద్దల కొండ గణేశ్’ చిత్రం విడుదలయ్యాక జనాలు నన్ను ‘వరుణ్’ అని కాకుండా ‘గణేశ్’ అనే పిలిచారు. నటుడిగా నాకది పెద్ద ప్రశంస. పాత్ర పేరుతో మనల్ని పిలిస్తే నటుడిగా వచ్చే సంతృప్తే వేరు. ఒక నటుడికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఇప్పుడు ‘మట్కా’ చిత్రంలో నేను పోషించిన వాసు పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ అని వరుణ్‌తేజ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మట్కా’. ఈ నెల 14న ‘మట్కా’ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మీడియాతో ముచ్చటించారు.
బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన వాసు అనే అబ్బాయి కథే మట్కా. 1958 నుంచి 1982 వరకూ మట్కా సామ్రాజ్యంలో అతను అంచెలంచెలుగా ఎదిగిన తీరును సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నాం.
కరుణకుమార్ మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ సినిమాతో ఆయనకు ఇంకా మంచి పేరు వస్తుంది. ముంబైకి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా కరుణకుమార్ ఈ కథ రాసుకున్నారు. మన నేటివిటీకి తగ్గట్లు కథలో, హీరో పాత్రలో మార్పులు చేశాడు. ఆయనతో నా పాత్ర గురించి తరచూ చర్చించేవాణ్ణి. చాలా సార్లు స్ర్కిప్ట్ చదివాను. వాసు ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా సిగరెట్ కాలుస్తాడు అనేదానిపై ఒక అంచనాకు వ చ్చా.
వాసు లాంటి పాత్ర పోషించడం నటుడిగా నాకు సవాల్ విసిరింది. ఇందులో నాలుగు గెటప్స్‌లో కనిపిస్తాను. ఓల్డ్ క్యారెక్టర్ కోసం ఏఐ రిఫరెన్స్ తీసుకున్నాం.