నందమూరి వంశం నుంచి నాలుగో తరం

ABN , Publish Date - Oct 31 , 2024 | 02:06 AM

నందమూరి వంశం నుంచి నాలుగో తరం నటుడు వెండి తెరపైకి రాబోతున్నాడు. లెజండరీ నటుడు ఎన్టీఆర్‌ ముని మనవడు, హరికృష్ణ మనవడు, జానకీరామ్‌ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు....

నందమూరి వంశం నుంచి నాలుగో తరం నటుడు వెండి తెరపైకి రాబోతున్నాడు. లెజండరీ నటుడు ఎన్టీఆర్‌ ముని మనవడు, హరికృష్ణ మనవడు, జానకీరామ్‌ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. వైవిఎస్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ టాలెంట్‌ రోర్స్‌ పతాకంపై యలమంచిలి గీత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనిదత్‌ చేతుల మీదుగా ‘ఎన్టీఆర్‌ తొలి దర్శనం’ పేరుతో హీరో ఫస్ట్‌ లుక్స్‌ గ్లింప్స్‌ బుధవారం జరిగిన కార్యక్రమంలో రిలీజ్‌ చేశారు. పొడవాటి జుట్టు, ధృడమైన శరీరాకృతితో అందంగా కనిపించారు చిన్న ఎన్టీఆర్‌. అర్ధవంతమైన పాత్రలను ఎన్నుకుని ప్రేక్షకులను అలరిస్తాననీ, పరిశ్రమకు విధేయుడిగా ఉంటాననీ పెద్ద ఎన్టీఆర్‌పై ప్రమాణం చేశారు ఈ చిన్న ఎన్టీఆర్‌. 18 నెలల పాటు దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో శిక్షణ పొందానని తెలిపారు. ఈ సినిమాలో చిన్న ఎన్టీఆర్‌ సరసన వీణా రావు కథానాయికగా నటిస్తున్నారు. ఈ సంద్భర్భంగా వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ‘పెద్దాయన ఎన్టీఆర్‌తో జగత్‌ విఖ్యాతమైన సినిమాలు తీసి..


ఆయన కీర్తి ప్రతిష్ఠలను ఎంతో ఇనుమడింపజేసే ప్రయాణంలో మా గురువుగారైన రాఘవేంద్రరావు ఎంతో కృషి చేశారు. అలాగే అన్నగారి చేతుల మీదుగా అశ్వనీదత్‌గారి వైజయంతీ మూవీస్‌ సంస్థ ప్రతిష్ఠాపించగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఎన్టీఆర్‌ చేతి చలవ అలాంటిది. అలాంటి ఇద్దరి ఆశీస్సులతో మరొక ఎన్టీఆర్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడు. ఈ మహానుభావులిద్దరికీ రామారావు గారితో అనుబంధం ఉంది. పండితుల వేద మంత్రాల సాక్షిగా ఈ పెద్దలిద్దరితో ఈ నందమూరి తారక రామారావు షో రీల్‌ని పరిచయం చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 02:06 AM