ప్రముఖ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ కన్నుమూత

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:47 AM

‘‘చిట్టి ఆయీ హై’’, ‘‘ఔర్‌ ఆహిస్తా కీజియే బాతే’’ అంటూ మధురమైన గానంతో సంగీత ప్రియులను మైమరపించిన ఆ గొంతు మూగబోయింది. ప్రముఖ గజల్‌, నేపథ్య గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ (72) ఇక లేరు...

ప్రముఖ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ కన్నుమూత

  • కొన్నాళ్లుగా అనారోగ్యం

  • ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస

‘‘చిట్టి ఆయీ హై’’, ‘‘ఔర్‌ ఆహిస్తా కీజియే బాతే’’ అంటూ మధురమైన గానంతో సంగీత ప్రియులను మైమరపించిన ఆ గొంతు మూగబోయింది. ప్రముఖ గజల్‌, నేపథ్య గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ (72) ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఫరీదా, కూతుళ్లు రేవా, నయాబ్‌ ఉన్నారు. పంకజ్‌ ఉధాస్‌ మరణ వార్తను నయాబ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. చాలా బరువైన హృదయంతో.. పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్‌ కన్నుమూశారని తెలియజేయడానికి మేము చింతిస్తున్నామని ఆమె ప్రకటించారు. మంగళవారం పంకజ్‌ ఉధాస్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘నామ్‌’’, ‘‘సాజన్‌’’, ‘‘మొహ్రా’’ వంటి అనేక హిందీ చిత్రాలకు పంకజ్‌ ఉధాస్‌ గాత్రదానం చేశారు. పంకజ్‌ గుజరాత్‌లో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కేశుభాయ్‌ తీగల వాయిద్యం దిల్రూబాను వాయించే వారు. ఆయన ఇద్దరు సోదరులు మన్హర్‌ ఉధాస్‌, నిర్మల్‌ ఉధాస్‌ కూడా గాయకులే. 1986లో విడుదలైన నామ్‌ చిత్రంలోని ‘‘చిట్టి ఆయీ హై’’ పాటతో ఆయన ప్రొఫెషనల్‌ సింగర్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాతి నుంచి ఆయన చాలా ఆల్బమ్‌లను రికార్డు చేశారు. 2006 సంవత్సరంలో భారత ప్రభుత్వం పంకజ్‌ ఉధాస్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పంకజ్‌ ఉధాస్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పద్మశ్రీ, ఇతర అవార్డులు వరించిన పంకజ్‌ ఉధాస్‌ శాస్ర్తీయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత సంగీతానికి ఆయన వెలుగుదివ్వెగా ప్రధాని అభివర్ణించారు. ఆయన మెలోడీలు తరాలు దాటిపోయాయన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూరించలేనిదని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ‘ఎక్స్‌’ వేదికగా ప్రధాని పేర్కొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 04:47 AM