ప్రతి ఒక్కరూ రిలేట్‌ అవుతారు

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:42 AM

దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘లవ్‌ మౌళి’. నవదీప్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో పంఖురి గిద్వాని, భావన సాగి హీరోయిన్లుగా నటించారు. సి స్పేస్‌, నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌...

ప్రతి ఒక్కరూ రిలేట్‌ అవుతారు

దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘లవ్‌ మౌళి’. నవదీప్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో పంఖురి గిద్వాని, భావన సాగి హీరోయిన్లుగా నటించారు. సి స్పేస్‌, నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ నిర్మించారు. రేపు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు అవనీంద్ర మీడియాతో ముచ్చటించారు.


‘‘నా తొలి ప్రాజెక్టును ఏదైనా కొత్త కథతో విభిన్నంగా.. వైవిధ్యంగా తెరకెక్కించాలనిపించింది. దానిక్కారణం అప్పటికే నేను చాలా కమర్షియల్‌ సినిమాలకు వర్క్‌ చేశాను. కాబట్టి ఒక పొయెటిక్‌ లవ్‌ స్టోరీని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రాయాలనిపించింది. ఇందులో లీడ్‌ రోల్‌ కోసం చాలా మందిని అనుకునే సమయంలో నవదీప్‌ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటారని భావించి ఆయన్ని అప్రోచ్‌ అయ్యా. ఆయన కథ విని.. ఇలాంటి సినిమాలో నటించేందుకే ఎదురుచూస్తున్నాను అని వెంటనే ఓకే చేశారు. మేఘాలయాలో మొదటి సారి షూటింగ్‌ జరుపుకొన్న చిత్రమిదే. కొన్ని వాస్తవ సంఘటనలకు ఫిక్షన్‌, ఫాంటసీ కలిపి తెరకెక్కించిన కథ ఇది. సినిమాలో నవదీప్‌ క్యారెక్టర్‌లో చాలా విభిన్నమైన షేడ్స్‌ ఉంటాయి. ఇది ఒక చిత్రకారుడి ఎమోషనల్‌ జర్నీ. నిజమైన ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇస్తుందీ సినిమా. ఇందులోని బోల్డ్‌ డైలాగ్స్‌, లిప్‌లాక్స్‌ కథకు అవసరమై పెట్టినవే. ప్రశాంతంగా లవ్‌ మూడ్‌లో కూర్చున్న శివుడిని మౌళి అంటారు అందుకే ఈ టైటిల్‌ పెట్టాం. ఈ సినిమాతో ప్రతీ ఒక్కరు ఏదో ఒక విషయంలో రిలేట్‌ అవుతారు. ఈ సినిమాలో మ్యూజిక్‌ చాలా కీలకం. గోవింద్‌ వసంత అద్భుతమైన పాటలు ఇచ్చారు’’ అని చెప్పారు.

Updated Date - Jun 06 , 2024 | 03:42 AM