యానిమేషన్‌ చిత్రానికి డాలర్ల పంట

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:33 AM

యానిమేషన్‌ చిత్రం ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ ప్రపంచవ్యాప్తంగా దుమ్ముదులుపుతోంది. చరిత్రలో ఇప్పటివరకూ ఏ యానిమేషన్‌ చిత్రం సాధించని అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది. కేవలం మూడు వారాల్లోనే గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద వన్‌ బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8500 కోట్లు) అర్జించింది...

యానిమేషన్‌ చిత్రానికి డాలర్ల పంట

యానిమేషన్‌ చిత్రం ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ ప్రపంచవ్యాప్తంగా దుమ్ముదులుపుతోంది. చరిత్రలో ఇప్పటివరకూ ఏ యానిమేషన్‌ చిత్రం సాధించని అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది. కేవలం మూడు వారాల్లోనే గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద వన్‌ బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8500 కోట్లు) అర్జించింది. ఇటువంటి సంచలన రికార్డు సాధించడమే కాకుండా ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజైన అన్ని సినిమాల కలెక్షన్లను వెనక్కునెట్టి అగ్ర స్ధానాన్ని కైవసం చేసుకుంది. మొత్తానికి వన్‌ బిలియన్‌ డాలర్లు కొల్లగొట్టిన 11వ యానిమేషన్‌ సినిమాగా ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ చరిత్ర సృష్టించింది. ఇండియాలోనూ రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్లను సాధించడం విశేషం. 2015లో ఈ సినిమా మొదటి భాగం ‘ఇన్‌సైడ్‌ అవుట్‌’ జూన్‌ 19న విడుదలైంది. ఈ చిత్రానికి పీట్‌ డాక్టర్‌ దర్శకత్వం వహించారు. 11 ఏళ్ల రిలే అండర్సన్‌ అనే బాలిక మెదడులోని భావోద్వేగాలైన ఆనందం, కోపం, చిరాకు, బాధ, భయం యానిమేషన్‌ రూపు సంపాదించుకుని..


ఆమె ఆలోచనల్ని, నిర్ణయాల్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ దాదాపు 900 మిలియన్‌ డాలర్లు (రూ.7500 కోట్లు). ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’. జూన్‌ 14న విడుదలైన ఈ సీక్వెల్‌కు కెల్సీ మన్‌ దర్శకత్వం వహించారు. దాదాపు 96 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వాల్డ్‌ డిస్నీ అనుబంధ సంస్థ పిక్సర్‌ నిర్మించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన తోటి మిత్రులతో ఐస్‌ హాకీ ఆడే సమయంలో 13 ఏళ్ల రిలే అండర్సన్‌ జీవితంలోకి ఆందోళన, అసంతృప్తి, సిగ్గు, అసూయ ప్రవేశిస్తాయి. ఆ క్షణం నుంచి సినిమా ఎన్ని మలుపులు తీసుకుందనేది దర్శకుడు చాలా వినోదాత్మకంగా చూపించారు. టీనేజర్లను విపరీతంగా ఆకట్టుకునేలా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం కుటుంబ సమేతంగా ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈ సినిమా మరిన్ని రికార్డులు సాధించడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Jul 02 , 2024 | 12:33 AM