క్రమశిక్షణ, నిజాయితీ ఆయన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాయి

ABN , Publish Date - Feb 11 , 2024 | 03:16 AM

‘మురళీమోహన్‌లో నాకు నచ్చింది క్రమశిక్షణ, నిజాయితీ. జయాపజయాలను ఒక్కటిగా తీసుకోవడం ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. యువత ఆయన్నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి...

క్రమశిక్షణ, నిజాయితీ ఆయన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాయి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

‘మురళీమోహన్‌లో నాకు నచ్చింది క్రమశిక్షణ, నిజాయితీ. జయాపజయాలను ఒక్కటిగా తీసుకోవడం ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. యువత ఆయన్నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి. వారు మంచి సందేశం ఉన్న సినిమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ‘సకుటుంబ, సపరివార సమేతంగా చూసేలా సినిమాలు రాయండి, తీయండి. కుటుంబాలను, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించండి’ అని ఆయన కోరారు. ‘పీవీ నరసింహారావు గారి ముందు చూపు వల్లనే నేడు దేశం ఇంత ముందుకు సాగింది. ఆయనకు భారతరత్న రావడం చాలా ఆనందకరమైన విషయం. చంద్రబాబు సంస్కరణల వల్లనే నేడు హైదరాబాద్‌ టెక్నాలజీ, ఫైనాన్షియల్‌, ఇండ్రస్ట్రీ హబ్‌గా మారింది’ అని పేర్కొన్నారు వెంకయ్యనాయుడు. నటుడు, నిర్మాత మురళీమోహన్‌ 50ఏళ్ల సినీ జీవితం పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం శిల్పకళా వేదికలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరో ముఖ్య అతిథి చంద్రబాబు మాట్లాడుతూ ‘ఏ పనైనా మనసుపెట్టి చేసే వ్యక్తి మురళీమోహన్‌. సినిమాల నిర్మాణంలో, రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఆయన అద్భుతంగా రాణించారు. ఎంతో మందిని సొంత ఖర్చులతో చదివించి డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చి దిద్దారు. ఇక వెంకయ్యనాయుడు గారి విషయానికి వస్తే ఆయన రాజకీయాల్లో సిన్సియారిటీకి మారుపేరుగా నిలిచారు. ఆయనకు పద్మ విభూషణ్‌, పీవీ నరసింహారావు గారికి భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలు రావడం మనందరికీ గర్వకారణం’ అన్నారు.

ఎన్టీఆర్‌లోని అనేక మంచి లక్షణాలను ఆదర్శంగా తీసుకుని మురళీమోహన్‌ ఎంతో ఎత్తుకు ఎదిగారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . చివరిగా మురళీమోహన్‌ మాట్లాడుతూ.. ‘నేను ఇవాళ ఈ స్థాయిలో మీ ముందు ఉన్నానంటే అట్లూరి పూర్ణచంద్రరావు గారు పెట్టిన భిక్షే. 1973లో ఆయన నాకు హీరోగా అవకాశం ఇస్తే, ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టారు దాసరి గారు. వీరిద్దరినీ నా జీవితంలో మర్చిపోలేను’ అన్నారు. 50 ఏళ్ల క్రితం తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావుకు ఈ సందర్భంగా మురళీమోహన్‌ ఒక కారును బహుమతిగా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాటి హీరోయిన్లు ప్రభ, జయచిత్ర, కవిత, సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు అశ్వినీదత్‌, సురేశ్‌బాబు, సంగీత దర్శకుడు కీరవాణి, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల, పార్లమెంట్‌ సభ్యులు రఘురామ కృష్ణంరాజు, సుజనా చౌదరీ, నటుడు ప్రదీప్‌, కొల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 03:16 AM