Disaster Show: బుజ్జీ! ఎంతపనైపోయింది, టోటల్ ఫ్లాప్ కదా!

ABN , Publish Date - May 23 , 2024 | 03:08 PM

దాసరి జన్మదినమైన మే 4 దర్శకుల రోజు అని చెప్పి వేడుక చెయ్యాలని నిర్ణయించుకున్నారు తెలుగు దర్శకుల సంఘం వారు. అయితే ఆ వేడుక అనివార్య కారణాలవలన మే 19న జరిగింది. కానీ ఈ వేడుక సరిగ్గా నిర్వహించలేకపోయామని, మమ్మల్ని క్షమించమని చెపుతూ దర్శకుల సంఘం రాసిన లేఖ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Disaster Show: బుజ్జీ! ఎంతపనైపోయింది, టోటల్ ఫ్లాప్ కదా!
Allu Arjun, Nani attended for the Directors Day event held few days back

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదిన తేదీ అయిన మే 4ని దర్శకుల రోజుగా పరిగణిస్తూ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఒక పెద్ద పండగను చెయ్యాలని నిర్ణయించింది. అయితే దానికి పరిశ్రమలో వుండే నటీనటులను, ఇతర సాంకేతిక నిపుణలను ఆహ్వానించింది. ఈ పండగకి ముందుగా అనుకున్న తేదీలలో పోలీసు వారి దగ్గర నుండి అనుమతి లేకపోవటం, చివరకి మే 19న లాల్ బహదూర్ స్టేడియంలో ఈ వేడుకని పూర్తి చేశారు.

directorsdayalluarjun.jpg

అయితే ఈ వేడుక జరిగినట్టుగా కూడా ఎక్కడా పెద్దగా వార్తలు రాలేదు, ఎందుకంటే ఈ వేడుక టెలికాస్ట్ చేసే హక్కులు ఒక ఓటిటి ఛానల్ కి అమ్మినట్టుగా తెలిసింది. అందుకని ఈ వేడుక జరిగిన ఒక్క వీడియో కూడా బయటకి రాలేదు. అయితే ఈ వేడుకకి పరిశ్రమనుండి తారాలోకం తరలి వస్తుందని చెప్పి ఆన్ లైన్ లో టికెట్స్ కూడా అమ్మడం జరిగింది. కానీ కేవలం కొంతమంది నటులు మాత్రమే హాజరయినట్టుగా తెలిసింది. అయితే ఈ దర్శకుల సంఘం చేసిన వేడుక మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిందని తెలుస్తోంది. అనుభవం లేక, ఎలా చెయ్యాలో తెలియక, అతిధులతో సరైన సమన్వయ లోపం రావటంతో ఈ వేడుక అభాసుపాలైందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

అదీ కాకుండా ఈ వేడుక ఎందుకు చేస్తున్నారో ఆ విషయం కూడా మర్చిపోయి, అక్కడికి అతిధులుగా వచ్చిన ఒకరిద్దరు నటులను పొగడ్తలతో ముంచెత్తడంతోటే వీరికి సరిపోయింది అని అంటున్నారు. ఈ వేడుక దాసరి పుట్టినరోజు అయిన మే 4 దర్శకుల రోజుగా పరిగణిస్తూ కదా చేస్తున్నది, కానీ దాసరి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటున్నారు. దాసరి గురించి ఎవరూ మాట్లాడకుండా వచ్చిన అతిధి అల్లు అర్జున్ ని పొగడటానికి అందరికీ సరిపోయింది అని అంటున్నారు. అదీ కాకుండా ప్రసార హక్కులు తీసుకున్న ఆ ఓటిటి కూడా అల్లు అర్జున్ కి చెందినది కావటం, అందుకనే అతను అతిధిగా వచ్చారని ఇంకో చర్చ నడుస్తోంది.

alluarjunatdirectorsday.jpg

అలాగే దర్శకుల సంఘం క్షమించమని తప్పులు చాలా జరిగాయని వొప్పుకున్నట్టుగా ఒక లేఖ బయటకి వచ్చింది. ముఖ్యంగా చాలామంది కుటుంబాలతో వచ్చినవాళ్లు ఇబ్బంది పడ్డారని వాళ్లందరినీ క్షమించమని సంఘం పేరుపైన వున్న ఒక లేఖ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాదాపు 9 వేల మంది హాజరైన ఈ కార్యక్రమానికి సరైన అనుభవం, క్రౌడ్ మేనేజ్ మెంట్ పై పట్టు లేని కొత్త ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ వల్ల మేము, మా కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొత్తగా వచ్చిన వారు కూడా నష్టాన్ని భరిస్తామనే ఒప్పందంతో వారికి ఇవ్వాల్సి వచ్చిందని మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాం. అన్ని వేల మందికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో చివరి నిమిషంలో వేదిక మార్చుకోవాల్సిన గందరగోళంలో తగిన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాం అని ఈ లేఖలో సారాంశం.

ఈ తప్పును మీరు దయతో క్షమించి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతామని హామీ ఇస్తున్నాము అంటూ ఈ లేఖలో చెప్పారు. దర్శకుల సంఘం సభ్యుల బీమా మరియు ఇతర అవసరాలకు స్వయం సమృద్ధిగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఎలాంటి లోపం, జాప్యం లేకుండా త్వరలో సాధారణ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మన సభ్యుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఈ కమిటి మనలను మన్నించి తదుపరి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అందరూ మనస్పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాము అని చెప్పారు ఆ లేఖలో.

directorsday.jpg

ఈ దర్శకుల సంఘానికి అగ్ర నటుల్లో ఒకరైన ప్రభాస్ రూ.35 లక్షలు డొనేట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ గురించైనా మాట్లాడారో లేదో! వేడుకకి హాజరయిన కొంతమంది నటులు వేడుక పూర్తయిన తరువాత చాలా ఇబ్బంది పడ్డారని కూడా తెలిసింది. ఎందుకంటే వందలమంది అభిమానులు ఈ నటులను చూడటానికి ఎగబడ్డారని, వాళ్ళని తప్పించుకోవటాని నలుగురు నటులు ఒకే కారులో ఎక్కి తప్పించుకున్నారని తెలిసింది. అడివి శేష్, నాని, అల్లరి నరేష్ లాంటి నటులు తమ వాహనాల దగ్గరకి కూడా వెళ్లే పరిస్థితి లేకపోవటంతో దగ్గరలో వున్న ఒకే కారులో అందరూ వెళ్ళవలసి వచ్చిందని తెలిసింది. ఇలా ఈ వేడుక మొత్తం రసాభాస అయినట్టుగా తెలుస్తోంది.

Updated Date - May 23 , 2024 | 03:12 PM