దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:17 AM

ప్రముఖ నటుడు, సినీ దర్శకుడు సురేష్‌ అలియాస్‌ సూర్య కిరణ్‌ (48) అనారోగ్యం కారణంగా సోమవారం చెన్నై నగరంలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ...

దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత

ప్రముఖ నటుడు, సినీ దర్శకుడు సురేష్‌ అలియాస్‌ సూర్య కిరణ్‌ (48) అనారోగ్యం కారణంగా సోమవారం చెన్నై నగరంలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ నగరంలోని జెమ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఆయన.. సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికెళ్లిన కొద్దిసేపటికే కన్నుమూశారు. భౌతికకాయాన్ని స్థానిక కేకే నగర్‌లోని ఆయన నివాసంలో చివరిచూపు కోసం ఉంచారు. కేరళకు చెందిన సూర్యకిరణ్‌... తమిళంలో ‘మౌనగీతంగల్‌’ అనే చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తమిళం, తెలుగు చిత్రాల్లో నటించడమే కాకుండా, పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగులో ‘సత్యం’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన... ‘ధన 51’, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజుభాయ్‌’, ‘చాప్టర్‌6’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే, రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌, చిరంజీవి వంటి హీరోల చిత్రాల్లో కూడా చిన్న పాత్రలను పోషించారు. హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్‌... మనస్పర్థల కారణంగా విడిపోయారు. తమిళంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటించిన ‘అరసి’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించగా, ఈ చిత్రం విడుదల కావాల్సివుంది.

చెన్నై, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 12 , 2024 | 05:17 AM