ఏపీలో దేవర టికెట్ ధరలు పెంపు
ABN , Publish Date - Sep 22 , 2024 | 02:41 AM
జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా సినిమా ’దేవర’ టిక్కెట్ల ధరలు పెంపు, స్పెషల్ షో లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 27న విడుదల అవుతోన్న ఈ సినిమా మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున ...
జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా సినిమా ’దేవర’ టిక్కెట్ల ధరలు పెంపు, స్పెషల్ షో లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 27న విడుదల అవుతోన్న ఈ సినిమా మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున రాష్ట్రంలో రిలీజైన అన్ని థియేటర్లలో ఆడించుకోవచ్చు. టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి నిర్మాతల వినతిని పరిశీలించిన ప్రభుత్వం 60రూపాయల నుంచి 135రూపాయల వరకూ పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. మొదటి రోజు అర్ధరాత్రి 12గంటలకు బెనిఫిట్ షో, ఉదయం ఆరింటికే మార్నింగ్ షో నుంచే సినిమా ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతలకు అనుమతి ఇచ్చింది. విడుదలైన రెండో రోజు(28) నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజూ ఐదు షో లు ప్రదర్శించుకోవచ్చు. అక్టోబరు 6తర్వాత సాదారణ ప్రదర్శనలు ఉంటాయి.
వేధించడం మా విధానం కాదు : పవన్ కల్యాణ్
‘రాజకీయాలకు అతీతంగా చిత్ర పరిశ్రమకు మేలు చేయాలనేదే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం. వైకాపా ప్రభుత్వం తరహాలో నిర్మాతలను, సినీ నటులను వేధించడం మా ప్రభుత్వ విధానం కాదు’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘దేవర’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్, నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ ట్వీట్ చేసింది. దీనిపై పవన్‌కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘వైసీపీ పాలనలో సినీ ప్రముఖులు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. వ్యక్తులు, రాజకీయాలతో మాకు సంబంధం లేదు, పరిశ్రమను మేం గౌరవిస్తాం. మీ సినిమాకు మంచి జరగాలి’ అని ‘దేవర’ యూనిట్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి (ఆంధ్రజ్యోతి)