దేవర టికెట్ ధరల పెంపు 10 రోజులే
ABN , Publish Date - Sep 26 , 2024 | 01:22 AM
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపును 10రోజులకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు ఉత్తర్వులు ఇస్తున్నామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్...
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపును 10రోజులకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు ఉత్తర్వులు ఇస్తున్నామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నెల్లూరుకు చెందిన పి. శివకుమార్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నెల 27న విడుదల కానున్న దేవర సినిమా ప్రత్యేక ప్రదర్శనలతో పాటు టికెట్ ధరలను పెంపునకు అనుమతిస్తూ నిబంధనలకు లోబడి టికెట్ ధరలు నిర్ణయించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 ప్రకారం సినిమా విడుదలైన నాటి నుంచి పదిరోజుల పాటు మాత్రమే టికెట్ ధరల పెంపునకు వెసులుబాటు ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన మెమోపై స్పష్టతనిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. విచారణను వారంరోజులకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోలో పెంపు ఎన్ని రోజులో ప్రస్తావించలేదన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.
అమరావతి (ఆంధ్రజ్యోతి)