దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
ABN , Publish Date - Sep 23 , 2024 | 06:21 AM
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. హెచ్‌ఐసీసీలో...
ఒక్కసారిగా దూసుకొచ్చిన అభిమానులు
హెచ్‌ఐసీసీ అద్దాలు ద్వంసం, పోలీసుల లాఠీ చార్జి
విచారం వ్యక్తం చేసిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. హెచ్‌ఐసీసీలో 3500 మందికి సీటింగ్ కెపాసిటీ ఉండగా నిర్వాహకులు 5వేల మందికి పాస్‌లు జారీ చేశారు. ఒక్కసారిగా అభిమానులు వేల సంఖ్యలో చొచ్చుకొని రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ప్రకటించారు. కెపాసిటీకి మించి పాస్‌లు ఇచ్చి, అభిమానులను గందరగోళానికి గురిచేయడమే కాకుండా, పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకుండా భద్రతా వైఫల్యానికి కారణమైన శ్రేయాస్ మీడియాపై పోలీసులు కేసు నమోదు చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు.
నేనే ఎక్కువ బాధపడుతున్నా : ఎన్టీఆర్
‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక రద్దవడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘అభిమాన సోదరులకి నమస్కారం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం ఎంతో బాధాకరం. సినిమా కోసం ఎంత కష్టపడ్డామో మీకు తెలియజేద్దాం అనుకున్నా. కానీ కార్యక్రమం రద్దయింది. దీనికి మీ కంటే నేనే ఎక్కువ బాధపడుతున్నా. కార్యక్రమం రద్దయినందుకు నిర్మాతల్ని, నిర్వాహకుల్ని తప్పు పట్టాల్సిన పని లేదనేది నా అభిప్రాయం. మనమంతా ఈ రోజు కలవకపోయినా.. ఈ నెల 27న థియేటర్లలో కలుసుకుందాం. మీరందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి’’ అని అందులో విజ్ఞప్తి చేశారు.