Mega Star Chiranjeevi: తమ్ముడి విజయంపై మెగాస్టార్ స్పందన ఇదే!

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:46 PM

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి సుమారు 70 వేల మెజారిటీ గెలుపొందిన ప్రకటన వెలువడగానే, పరిశ్రమనుండి ఎంతోమంది అతన్ని అభినందిస్తూ 'ఎక్స్' లో పోస్టులు పెడుతున్నారు. అన్నయ్య చిరంజీవి ఆనందానికి అయితే హద్దులే లేవు, తన తమ్ముడు కళ్యాణ్ గెలుపుపై అతని స్పందన ఎంతో భావోద్వేగంతో కూడినదై వుంది.

Mega Star Chiranjeevi: తమ్ముడి విజయంపై మెగాస్టార్ స్పందన ఇదే!
Mega Brothers

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గెలిచారు. ఇప్పుడు ఎంఎల్ఏ పవన్ కళ్యాణ్ అయ్యారు. తన పార్టీ మెజారిటీ సభ్యులను గెలిపించుకోవటమే కాకుండా, మిత్రపక్షాలైన తెలుగు దేశం పార్టీ, బీజేపీలను కూడా గెలిపించారు. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయేట్టుగా వున్నాయి, అందులో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా గొప్పది.

పవన్ కళ్యాణ్ గెలిచారు అని తెలియగానే, చిత్ర పరిశ్రమనుండి ఎంతోమంది తమ సంతోషాన్ని, శుభాకాంక్షలను పవన్ కళ్యాణ్ కి 'ఎక్స్' ద్వారా తెలియచేస్తున్నారు. ఎంతమంది తనకి శుభాకాంక్షలు చెప్పినా, తన అన్నయ్య చిరంజీవి.. కళ్యాణ్‌ని ప్రశంసించటం ఒక అనుభూతి, అదొక మరపురాని ఘట్టం.

megabrothers.jpg

అందుకే చిరంజీవి పవన్ కళ్యాణ్ గెలుపుని ఉద్దేశించి చెపుతూ, "ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది", అని చెప్పారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ గెలుపుపై ఏమి మాట్లాడారు అతని మాటల్లోనే చదవండి.

"డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను." అని పోస్ట్ చేశారు చిరంజీవి.


అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకీ మెగాస్టార్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరో ట్వీట్‌లో

‘‘ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను..’’ అని మెగాస్టార్ పోస్ట్ చేశారు.

Updated Date - Jun 04 , 2024 | 04:52 PM