హర్షను హీరోగా ఆదరించండి

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:44 AM

సుందరం మాస్టర్‌ చిత్రం ట్రైలర్‌ చాలా బావుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్లుంది. తన ప్రతిభను నమ్ముకొని హర్ష ఓ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. హాస్యంతో పాటు ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్న సినిమా...

హర్షను హీరోగా ఆదరించండి

సుందరం మాస్టర్‌ చిత్రం ట్రైలర్‌ చాలా బావుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్లుంది. తన ప్రతిభను నమ్ముకొని హర్ష ఓ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. హాస్యంతో పాటు ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్న సినిమా ఇది. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ప్రేక్షకులు ఆదరించాలి. ‘సుందరం మాస్టర్‌’ చిత్రానికి పెద్ద విజయాన్ని అందించాలి’ అని చిరంజీవి ప్రేక్షకులను కోరారు. హర్ష చెముడు, దివ్యశ్రీ ప్రధాన పాత్ర ల్లో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’. హీరో రవితేజ, సుధీర్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతోంది. గురువారం చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుతం అమెరికా విహార యాత్రలో ఉన్న చిరంజీవి అన్‌లైన్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్‌’ చిత్రం చాలా కొత్త పాయింట్‌తో రాబోతోంది. మనలో ఒకడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. అందరినీ ఆలోచింపజేసే చిత్రమిది. కామెడీతో పాటు అద్భుతమైన డ్రామా ఉంది’ అన్నారు. మైనా అనే అద్భుతమైన పాత్రను సృజించి, నటిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని దివ్యశ్రీ పాద చెప్పారు. దర్శకుడు కల్యాణ్‌ సంతోష్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాను. నా జీవితంలో తారసపడిన కొందరు వ్యక్తుల స్ఫూర్తితో కథ రాసుకున్నాను. ఈ సినిమాకు డబ్బు కంటే సమయాన్ని ఎక్కువ పెట్టుబడిగా పెట్టాం’ అని తెలిపారు. సుధీర్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్ర నిర్మాణంలో రవితేజ సహకారం మరువలేనిది. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని చెప్పారు. కొత్తగా ఉండాలని బాబా సెహగల్‌ గారితో ఈ చిత్రంలో ఓ పాట పాడించామని సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల తెలిపారు.

Updated Date - Feb 16 , 2024 | 05:44 AM