డేట్‌ మార్చడమే ‘ స్త్రీ 2’కి కలిసొచ్చిందా?

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:05 AM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ గురువారం రెండు హిందీ చిత్రాలు విడుదలవుతున్నాయి. అవేమిటంటే.. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ఖేల్‌ ఖేల్‌ మే’, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్ర పోషించిన ‘వేదా’. వీటి కంటే ఒక రోజు ముందే...

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ గురువారం రెండు హిందీ చిత్రాలు విడుదలవుతున్నాయి. అవేమిటంటే.. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ఖేల్‌ ఖేల్‌ మే’, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్ర పోషించిన ‘వేదా’. వీటి కంటే ఒక రోజు ముందే రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధా కపూర్‌ నటించిన ‘స్త్రీ 2’ రిలీజ్‌ అవుతోంది. ఈ మూడు చిత్రాల్లో మొదటి నుంచీ ‘స్త్రీ 2’ చిత్రం మీద ఎవరికీ అంచనాలు లేవు. దీనికి ప్రధాన కారణం హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌కు నాలుగేళ్లుగా సరైన హిట్‌ లేకపోవడం. అలాగే హీరో రాజ్‌కుమార్‌ రావుకు ఈ ఏడాది విడుదలవుతున్న మూడో సినిమా ఇది. అతనికి కూడా ఓహో అనిపించే హిట్‌ పడకపోవడం మరో కారణం. రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధా కపూర్‌ నటించిన ‘స్ర్తీ’ చిత్రం 2018లో విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. అప్పట్లోనే ఈ హారర్‌ కామెడీ రూ వంద కోట్లు వసూలు చేసింది. సాధారణంగా సీక్వెల్‌ అనగానే భారీ అంచనాలు ఉండడం సహజం. కానీ ‘స్త్రీ’ సీక్వెల్‌కు అంత క్రేజ్‌ రాకపోవడం గమనార్హం.


మొదట ఈ సినిమాను కూడా గురువారమే విడుదల చేయాలనుకున్నారు. అప్పటికే రెండు భారీ చిత్రాలు పోటీలో ఉండడంతో భారీ ఓపెనింగ్స్‌ వస్తే గొప్పే అని అనుకున్నారు .కానీ అనూహ్యంగా గురువారం కు బదులు బుధవారమే సినిమాను విడుదల చేయాలని చివరి క్షణంలో నిర్ణయం తీసుకోవడం ‘‘స్త్రీ 2’ కు కలసి వచ్చిందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. సోలో రిలీజ్‌ కావడంతో మొదటి రోజే రూ పది కోట్లకు పైగా కలెక్ట్‌ చేస్తుందని ఓ అంచనా. టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ జోరు చూస్తుంటే అంత మొత్తం వసూలు చేయడం ఈజీయే అని ట్రేడ్‌ పండితులు పేర్కొంటున్నారు. చిన్న చిత్రాల్లో ‘గదర్‌ 2’ చిత్రానిదే ఇప్పటివరకూ రికార్డ్‌. ఆ సినిమా తొలి వారం రూ 40.10 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడున్న అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్‌ను పరిశీలిస్తే ‘స్త్రీ 2’ దానిని అధిగమించి, రూ 50 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకూ ‘స్ర్తీ 2’ చిత్రానికి సంబంధించి 2.21 లక్షల టికెట్లు అడ్వాన్స్‌గా బుక్‌ అయ్యాయి. దీని వల్ల రూ. 6.87 కోట్లు వసూలు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ సర్య్యూట్స్‌ లోనే అత్యధిక టికెట్లు అమ్ముడవడం విశేషం.


ఓపెనింగ్‌ రోజు థియేటర్ల దగ్గర అమ్మకాలు ఉంటాయి కనుక రూ పది కోట్లు వసూలు చయడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. అదే నిజమై ‘స్ర్తీ 2’ తొలి వారం రూ 50 కోట్లు వసూలు చేస్తే హారర్‌ కామెడీ చిత్రాల్లో ఇదే హయ్యెస్ట్‌ రికార్డ్‌ అవుతుంది. ఈ అంకెలు ఎంతవరకూ నిజమవుతాయో కొన్ని గంటల్లో తేలిపోతుంది కనుక వేచి చూద్దాం.

Updated Date - Aug 14 , 2024 | 03:05 AM