భారతీయ లఘు చిత్రానికి కేన్స్‌ పురస్కారం

ABN , Publish Date - May 25 , 2024 | 06:16 AM

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో భారతీయ లఘు చిత్రం ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌వన్‌ టూ నో’ సత్తా చాటింది. 2024 ఉత్తమ లఘుచిత్రం విభాగంలో పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

భారతీయ లఘు చిత్రానికి కేన్స్‌ పురస్కారం

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో భారతీయ లఘు చిత్రం ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌వన్‌ టూ నో’ సత్తా చాటింది. 2024 ఉత్తమ లఘుచిత్రం విభాగంలో పురస్కారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 చిత్రాలు తుది బరిలో నిలవగా ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌వన్‌ టూ నో’ విజేతగా నిలిచింది. 16 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రానికి ఎస్‌ చిదానంద నాయక్‌ దర్శకత్వం వహించారు. కన్నడ జానపద గాథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. వృద్ధురాలు ఎంతో ప్రేమగా పెంచుకొన్న కోడిని దొంగలు ఎత్తుకుపోవడం, దాని ఆచూకి కోసం ఆమె చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఒక భారతీయ సినిమా కేన్స్‌ పురస్కారాన్ని గెలుచుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ వార్త వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్‌ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ ఒన్స్‌ టూ నో’ బృందానికి ఇవే నా అభినందనలు’ అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఇదే కేటగిరీలో భారతీయ నిర్మాత మహేశ్వరి తెరకెక్కించిన యానిమేటెడ్‌ చిత్రం ‘బన్నీ హుడ్‌’ మూడోస్థానంలో నిలిచింది.

Updated Date - May 25 , 2024 | 06:16 AM