Bhaje vayuvegam : సెకండ్‌ ఇన్నింగ్స్‌ సూపర్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:50 AM

కార్తికేయ గుమ్మకొండ, రాహుల్‌ టైసన్‌ హీరోలుగా నటించిన ‘భజే వాయువేగం’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల రూపొందించిన ‘హ్యాపీ డేస్‌’ చిత్రంలో...

Bhaje vayuvegam : సెకండ్‌ ఇన్నింగ్స్‌ సూపర్‌

కార్తికేయ గుమ్మకొండ, రాహుల్‌ టైసన్‌ హీరోలుగా నటించిన ‘భజే వాయువేగం’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దర్శకుడు శేఖర్‌ కమ్ముల రూపొందించిన ‘హ్యాపీ డేస్‌’ చిత్రంలో నలుగురు హీరోల్లో ఒకరిగా నటించి, ‘టైసన్‌’ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్‌ ‘భజే వాయువేగం’ సినిమాతో సెకండ్స్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రేక్షకులూ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారనీ, తన పాత్రకు కూడా మంచి స్పందన వస్తోందని రాహుల్‌ ‘చిత్రజ్యోతి’కి తెలిపారు. ‘ఈ సినిమా విడుదలకు ముందు ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌, యూనిట్‌ సభ్యులందరం కలసి చూశాం. సినిమా బాగా వచ్చిందనీ, తప్పకుండా హిట్‌ అవుతుందని మా అందరికీ నమ్మకం కలిగింది. అదే అభిప్రాయాన్ని ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మరో మంచి సినిమాతో ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు రాహుల్‌.


ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందని అడిగితే ‘యూవీ క్రియేషన్స్‌ ఓ చిన్న సినిమా ప్లాన్‌ చేస్తూ నాకు హీరోగా అవకాశం ఇచ్చింది. ఆ సినిమా పేరు ‘గోడ’ అది నిర్మాణంలో ఉండగానే యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలే ‘భజే వాయు వేగం’ సినిమా ప్రారంభించారు. కార్తికేయ హీరోగా నటించే ఆ సినిమాలో సెకండ్‌ హీరో కోసం వెదుకుతుంటే ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌రెడ్డికి నా పేరు సూచించారు యూవీ క్రియేషన్స్‌ అధినేతలు. ‘గోడ’ సినిమాలో నేను చేసిన వర్క్‌ చూసి సంతృప్తి చెంది ప్రశాంత్‌రెడ్డి ఇందులో అవకాశం ఇచ్చారు. ఒకే సంస్థలో రెండు మంచి చిత్రాలు రావడం.. రియల్లీ ఐయామ్‌ లక్కీ’ అని చెప్పారు రాహుల్‌. ఈ సినిమాతో కార్తికేయ రూపంలో మంచి స్నేహితుడు లభించాడనీ, సినిమాలో తామిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని ఆయన తెలిపారు. కార్తికేయ, తను, తనికెళ్ల భరణి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.


తన కొత్త సినిమాల గురించి వివరిస్తూ ‘గోడ’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాకు అది సెకండ్‌ ఫిల్మ్‌ అవుతుంది. మూడో సినిమా ఇప్పుడు నిర్మాణంలో ఉంది. వార్‌ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఆ చిత్రాన్ని నా స్నేహితుడే నిర్మిస్తున్నారు. అది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. చాలా కాలం నుంచి దాని మీద వర్క్‌ చేసి ఇప్పుడు షూటింగ్‌ ప్రారంభించాం. శివ అని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. ఇందులో నేను సోలో హీరోగా నటిస్తున్నాను. ఆర్మీలో ఆయుధాలను ఎలా ఉపయోగిస్తారో, వాళ్ల ట్రైనింగ్‌ ఎలా ఉంటుందో నాలుగు నెలల పాటు ఓ ఆర్మీ పర్సన్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాను. దీని తర్వాత టైమ్‌ ట్రావెల్‌ ఫిల్మ్‌ చేస్తున్నాను. ఈ చిత్రాలన్నీ నాకు మంచి పేరు తెస్తాయనే నమ్మకంతో ఉన్నాను’ అన్నారు రాహుల్‌.

Updated Date - Jun 06 , 2024 | 03:50 AM