జానీ మాస్టర్‌కు బెయిల్
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:30 AM
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. కొరియోగ్రాఫర్ జానీ ఇదే కేసులో కొన్ని వారాలుగా...
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. కొరియోగ్రాఫర్ జానీ ఇదే కేసులో కొన్ని వారాలుగా జైల్లో ఉంటున్నారు. తాను మైనర్‌నని, జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న యువతి చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే, తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు పెట్టారని, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ జానీ మాస్టర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సీ ప్రతాప్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు మేజర్ అని, నాలుగేళ్లుగా వారు కలిసి తిరిగినట్లు సాక్షులు పేర్కొంటున్నారని తెలిపారు.
ఏడాదిగా దూరంగా ఉన్న తర్వాత చాలా ఆలస్యంగా, జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు స్వీకరించే ముందు దురుద్దేశంతో కేసు పెట్టారని ఆరోపించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పిటిషనర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ.. కేసు దర్యాప్తు, ఫిర్యాదుదారు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది.