రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచా

ABN , Publish Date - Oct 29 , 2024 | 02:12 AM

‘ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డును’ సోమవారం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘‘ఏయన్నార్‌ అవార్డు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. అమితాబచ్చన్‌ చేతుల మీదు...

‘ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డును’ సోమవారం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘‘ఏయన్నార్‌ అవార్డు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. అమితాబచ్చన్‌ చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మై గురు, మై మెంటర్‌ మై ఇన్స్పిరేషన్‌ అమితాబ్‌ బచ్చన్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పద్మభూషణ్‌ అవార్డు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అమితాబ్‌ బచ్చన్‌ ‘చిరంజీవి కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌’ సినిమా అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ మాట విని షేక్‌ అయ్యాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ రోజు నేను ఆయనకి థాంక్స్‌ చెప్పానో లేదో కూడా తెలీదు. ఇండియన్‌ సినిమా లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ నుంచి ఆ మాటలు రావడం ఎంతో స్ఫూర్తినిచ్చాయి.


ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది. నేను హిందీలో చేసిన ‘ప్రతిబంధ్‌’ సినిమా అమితాబ్‌కు చూపించా. ఆయన .. ‘అద్భుతమైన సినిమా’ అని ప్రశంసించారు. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆయన ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. అమితాబ్‌ బచ్చన్‌ ‘సైరా’ సినిమాలో ఒక కామియో రోల్‌ చేశారు. ఆయనని ఎలా అడగాలో తెలియక మెేసజ్‌ పెట్టాను. అది చూసిన వెంటనే ఆ క్యారెక్టర్‌ చేస్తానని మాటిచ్చారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్‌ గురించి అడిగాను. ‘నీపై ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్‌ మై ఫ్రెండ్‌. ఫార్మాలిటీస్‌ గురించి మాట్లాడొద్దు’ అని చెప్పారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. లాంగ్‌ లీవ్‌ అమితాబ్‌. తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచానేమో అనిపిస్తోంది.


నాన్న మెచ్చుకొనేవారు కాదు

నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో బయట ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చేవి. అయితే ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని. మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. అలాంటి మా నాన్న నన్ను ఎందుకు మెచ్చుకోరు అనిపించేది. ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్‌ పేజీలతో నిండి ఉన్న కొన్ని పుస్తకాలను చూస్తున్నారు. నేను వెళ్లేసరికి తీసి పక్కన పడేశారు. ఫొటోలు బాగున్నాయిరా అని ఓ మాట అంటారేమో అని అనుకున్నాను. కానీ ఆయన అలా అనలేదు. లోపలకు అమ్మ దగ్గరకు వెళ్లి.. ‘ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. బయట రచ్చ ఎంత గెలిచినా సరే.. ఇంట గెలవడం లేదు అని బాధ కలుగుతోంది అని అన్నాను. దానికి అమ్మ ‘లేదురా నాన్న చాలా పొగుడుతారు. ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. మరి నా దగ్గర ఆ మాటలు అనొచ్చు కదా అని అమ్మను అంటే ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’’ అని అమ్మ చెప్పింది.


ఆ అవార్డు క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేశా

సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు నేను ఆ అవార్డును అందుకోవడం కొందరికి నచ్చలేదు. అందుకే ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేసి నాకు సరైన అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. ఈ రోజు ‘ఏఎన్నార్‌ అవార్డు’ను అమితాబ్‌ బచ్చన్‌ చేతులు మీదుగా అందుకున్నప్పుడు.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని అనిపిస్తోంది. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్‌ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం గొప్ప విషయం. అందుకే ఇది నాకు అన్ని పురస్కారాలకు మించింది. ఈ వేడుకలో అమ్మని ముందు సీటులో కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం.. అమ్మ నాగేశ్వరరావుకి సీనియర్‌ మోస్ట్‌ ఫ్యాన్‌. దేవానంద్‌, లతా మంగేష్కర్‌, అమితాబచ్చన్‌.. ఇలా ఎంతో గొప్ప వ్యక్తులకి వచ్చిన ఈ అవార్డు నాకు దక్కడం నా అదృష్టం.


ఈ అవార్డు రావడంతో నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని భావిస్తున్నాను అని అన్నారు. ‘‘ఇండియన్‌ సినిమాకి నాగేశ్వరరావు చేసిన సేవలు అనితర సాధ్యం. నాగేశ్వరరావు వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాగార్జునకి నా అభినందనలు’’ అని అమితాబ్‌బచ్చన్‌ అన్నారు. ‘‘ఏయన్నార్‌ అనే ఈ మూడక్షరాలే నాకు ప్రపంచం. నాకే కాదు మా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరికీ. మా నాన్న మానవత్వాన్ని.. మనుషుల్ని.. సినిమాలను ఎక్కువగా నమ్మారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండే అలాంటి గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్‌ అవార్డు ముఖ్య ఉద్దేశం’’ అని నాగార్జున తెలిపారు.

Updated Date - Oct 29 , 2024 | 05:45 PM