మెగాస్టార్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అజిత్‌

ABN , Publish Date - May 30 , 2024 | 12:22 AM

ఇరవై ఏళ్ల క్రితం సంగతి.... అజిత్‌కుమార్‌ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ సీనియర్‌ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ‘ప్రేమపుస్తకం’ చిత్రాన్ని ప్రారంభించారు. కాంచన్‌ కథానాయిక. నటుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు...

మెగాస్టార్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అజిత్‌

ఇరవై ఏళ్ల క్రితం సంగతి.... అజిత్‌కుమార్‌ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ సీనియర్‌ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు ‘ప్రేమపుస్తకం’ చిత్రాన్ని ప్రారంభించారు. కాంచన్‌ కథానాయిక. నటుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌ దీనికి దర్శకుడు. అయితే షూటింగ్‌ ప్రారంభించిన తొమ్మిదో రోజున వైజాగ్‌లో సముద్రం ఒడ్డున షూటింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోయి, మరణించారు. ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు దర్శకత్వ బాధ్యతలు వహించి చిత్రాన్ని పూర్తి చేశారు. చెన్నైలో జరిగిన ఆడియో వేడుకకు మెగాస్తార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై కొత్త హీరోని అభినందించి, వృద్ధిలోకి రమ్మని ఆశీర్వదించారు. ఆ తర్వాత అజిత్‌కుమార్‌ ‘అజిత్‌’గా తమిళ చిత్రరంగంలో పేరు తెచ్చుకుని అగ్రహీరోల్లో ఒకరిగా ఎదిగారు.


కట్‌ చేస్తే

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అలాగే అజిత్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా ‘విశ్వంభర’ సెట్‌కు వెళ్లి మెగాస్టార్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అజిత్‌ను చూసి ఆశ్చర్యపోయిన మెగాస్టార్‌ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ సినిమాల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది వైరల్‌ అయింది.

Updated Date - May 30 , 2024 | 12:22 AM