Aishwarya Rajesh: ఐశ్వర్య సినిమా ఫ్లాపు అవడానికి ప్రభాస్ 'సాహో' కారణం, అదేలా అంటే...

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:02 PM

ఐశ్వర్య మొదటి తెలుగు సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి' ఫ్లాపు అవటానికి కారణం ప్రభాస్ సినిమా 'సాహో'. ఎందుకంటే ఐశ్వర్య సినిమా విడుదలైన వారం తరువాత ప్రభాస్ సినిమా విడుదలైంది, ఆ తరువాత ఐశ్వర్య సినిమా థియేటర్ లో ఎక్కడా కనపడలేదు. ఆలా మొదటి సినిమా ఫ్లాపు, కానీ టీవిలో హిట్ అంట

Aishwarya Rajesh: ఐశ్వర్య సినిమా ఫ్లాపు అవడానికి ప్రభాస్ 'సాహో' కారణం, అదేలా అంటే...
Aishwarya Rajesh and a still from Saaho

ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయి, తెలుగు బాగా మాట్లాడుతారు కూడా. ప్రముఖ నటుడు రాజేష్ కుమార్త్ ఐశ్వర్య. తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె కథానాయికగా నటించిన తాజా తమిళ సినిమా 'డియర్' తెలుగులో అదే పేరుతో ఏప్రిల్ 12న తెలుగులో విడుదలవుతోంది. ఇందులో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడు. ఇది ఒక కామెడీ సినిమా అని చెపుతున్నారు. దీనికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. ఇందులో రోహిణి ఒక ముఖ్యమైన పాత్రలో కనపడతారు.

aishwaryarajeshone.jpg

ఐశ్వర్య తెలుగమ్మాయి అయినా తెలుగులో ఎక్కువ సినిమాలు మాత్రం చెయ్యలేదు. కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశారు, కానీ అవేమీ పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఆమె మొదటి తెలుగు సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి', ఇది క్రికెట్ నేపథ్యంలో వచ్చిన కథ. అయితే ఈ సినిమా విడుదల కొంచెం వాయిదా వెయ్యమని నిర్మాతలకి చెప్పినా, వాళ్ళు ఇక వేరే తేదీ లేక ఆగస్టు 23న విడుదల చేశారు అని చెప్పారు ఐశ్వర్య. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన వారం రోజులకే ప్రభాస్ నటించిన 'సాహో' (ఆగస్టు 30) విడుదలైందని, ఆ తరువాత తన సినిమా థియేటర్ లో ఎక్కడా కనిపించలేదని చెప్పారు ఐశ్వర్య.

aishwaryarajeshtwo.jpg

'నేను ఎవరో కూడా అప్పటికి ఇంకా తెలుగు ప్రేక్షకులకి తెలియదు, 'కౌసల్య కృష్ణమూర్తి' మంచి సినిమా, కానీ సినిమా విడుదలైన వారం రోజులకి 'సాహో' విడుదలైంది, ఆ తరువాత నా సినిమా ఎక్కడా కనపడలేదు' అని చెప్పారు ఐశ్వర్య. ఆ తరువాత 'వరల్డ్ ఫేమస్ లవర్', 'మిస్ మ్యాచ్', 'టక్ జగదీశ్', 'రిపబ్లిక్' సినిమాలు చేసినా అవి తెలుగులో సరిగ్గా నడవలేదు. తన సినిమాలు తెలుగులో ఎక్కువగా ఆడకపోవడం వలన తాను తెలుగులో చెయ్యడం లేదు అనేమాట సరికాదని ఆమె చెప్పారు. మంచి కథ, పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పారు. ఇక్కడ ఒక్క ఛాన్స్, ఒక్క సినిమా వస్తే చాలు ఆ తరువాత తెలుగులోనే ఎక్కువ చేస్తాను అని చెప్పారు.

aishwaryarajeshthree.jpg

'రిపబ్లిక్' సినిమా చేస్తున్నప్పుడు చాలామంది పిల్లలు తన దగ్గరికి వచ్చారని, అయితే వాళ్ళందరూ ఆ సినిమాలో కథానాయకుడు తేజ్ ని చూడటానికి వచ్చారనుకొని అతని కారవాన్ అటువైపు ఉందని చెప్పను. కానీ ఆ పిల్లలు అందరూ తననే చూడటానికి వచ్చారని, 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా చూసి కౌసల్యక్క అంటూ తనని పలకరించారని చెప్పారు ఐశ్వర్య. తరువాత ఆ సినిమా టీవీలో వచ్చినప్పుడు మంచి రేటింగ్స్ వచ్చాయని చెప్పారు ఐశ్వర్య.

Updated Date - Apr 08 , 2024 | 04:02 PM