సినిమా స్థాయికి తగిన సంఖ్యలో థియేటర్లు ఇవ్వాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:55 AM

తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను-మాన్‌’. కె. నిరంజన్‌రెడ్డి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతోంది..

సినిమా స్థాయికి తగిన సంఖ్యలో థియేటర్లు ఇవ్వాలి

తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను-మాన్‌’. కె. నిరంజన్‌రెడ్డి నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.

  • ‘హను-మాన్‌’ నిర్మాతగా నాకు తొలి చిత్రం. భారీ స్థాయిలో రూపుదిద్దుకోవడం, సంక్రాంతికి విడుదలవుతుండడం ఆనందాన్నిచ్చాయి. హాలీవుడ్‌లో సూపర్‌హీరో ఫ్రాంచైజీలో చాలా చిత్రాలు వచ్చాయి. అలాంటి ఫ్రాంచైజీ మనకు కూడా ఒకటి ఉండాలని ఈ సినిమా చేశాం. ఆంజనేయస్వామిని మన సంస్కృతిలో సూపర్‌హీరో అనుకోవచ్చు. సినిమా చూసిన ప్రేక్షకులంతా హనుమంతుడిని దర్శించుకున్న అనుభూతికి లోనవుతారు.

  • ఈ సినిమా కోసం మేం మూడేళ్లు కష్టపడ్డాం. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో కంటెంట్‌కు కావాల్సినవన్నీ ఎక్కడా రాజీపడకుండా సమకూర్చాం. ముందు అనుకున్న బడ్జెట్‌ కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ‘హను-మాన్‌’ వీఎఫ్‌ఎక్స్‌ క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన ప్రతిఫలం తెరపై కనిపిస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సినిమా స్థాయి పెరుగుతూ వచ్చింది. దానికి తగ్గట్లే సినిమాకు దేశ, విదేశాల్లో మంచి బిజినెస్‌ జరిగింది.

  • సంక్రాంతికి ఎన్ని సినిమాలు బరిలో ఉన్నా ‘హను-మాన్‌’ విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా లాంగ్‌ రన్‌ ఉన్న చిత్రమిది. అందుకే ముందుగా ఎక్కువ థియేటర్లలో చేయాలని తొందరపడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. హిందీలో 200 స్ర్కీన్లలో రిలీజ్‌ చేస్తున్నాం. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా సినిమా స్థాయికి తగిన సంఖ్యలో థియేటర్లు ఇవ్వాలని పరిశ్రమ పెద్దలను కోరుతున్నాం. ‘హను-మాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి గారు అతిథిగా వస్తున్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ వెసులుబాటు చేసుకొని రవితేజ గారు కోటి అనే పాత్రకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. మా బేనర్‌లో చేయబోయే కొత్త చిత్రాలను ఫిబ్రవరిలో ప్రకటిస్తాం.

Updated Date - Jan 05 , 2024 | 06:55 AM