Nandamuri Taraka Rama Rao : అనుసరణీయం.. చిరస్మరణీయం

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:36 AM

‘కళ కళ కోసం కాదు ప్రజా శ్రేయస్సు కోసం’ అని త్రికరణ శుద్ధిగా విశ్వసించి తదనుగుణంగా నడుచుకున్న ఏకైక కథానాయకుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అంటే అతిశయోక్తి కాదు...

Nandamuri Taraka Rama Rao : అనుసరణీయం.. చిరస్మరణీయం

‘కళ కళ కోసం కాదు ప్రజా శ్రేయస్సు కోసం’ అని త్రికరణ శుద్ధిగా విశ్వసించి తదనుగుణంగా నడుచుకున్న ఏకైక కథానాయకుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అంటే అతిశయోక్తి కాదు. అనేక చిత్రాల్లో బడుగు, బలహీన వర్గాల పక్షం నిలచి వారి కోసం న్యాయపోరాటం చేసే పాత్రల్లో నటించిన యన్టీఆర్‌, ఆయా వర్గాల అభిమానాన్ని విశేషంగా చూరగొన్నారు. తనను అంతగా అభిమానించే వారికి ఏదైనా చేయాలన్న తలంపుతోనే యన్టీఆర్‌ రాజకీయప్రవేశం చేసిన సంగతి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. కోట్ల రూపాయలు సంపాదించి, ఆ రోజుల్లోనే కోట్ల ఆదాయం చూస్తూ రాజభోగాలు అనుభవించిన యన్టీఆర్‌ పేదవాడే దేవుడు అని నమ్మి వారి కోసం ‘తెలుగుదేశం’ పార్టీ నెలకొల్పి, జనంలోకి వచ్చారు. ఆ రోజుల్లో యన్టీఆర్‌కు జనం పట్టిన బ్రహ్మరథం తరాలు మారినా అనితరసాధ్యంగానే నిలిచింది. కేవలం తొమ్మిది మాసాల్లోనే రాజకీయ రంగంలోనూ అధికారాన్ని చేజిక్కించుకొని, అప్పటికీ ఇప్పటికీ అనితర సాధ్యమైన చరిత్రను సృష్టించారు రామారావు. ఆయన రాజకీయ ప్రవేశాన్ని ఎద్దేవా చేసినవారు, అనుభవరాహిత్యం అని విమర్శించిన వారు సైతం ముక్కున వేలేసుకొనేలా పాలన సాగించి, పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధికి పాటు పడ్డారు యన్టీఆర్‌. ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు పేర్లు మార్చుకొని, రంగులు వేసుకొని చెలామణీ అవుతున్నాయి. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని చాటడమే కాదు, వారి పురోభివృద్ధికి అహర్నిశలూ పాటుపడ్డారు రామారావు. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ నాటికీ వెలుగుతూనే ఉంది. జయాపజయాలు ఎలా ఉన్నా, తెలుగుదేశం పార్టీ మనుగడ సాగుతూనే ఉంది. భావితరాలను సైతం ప్రభావితం చేసే దిశగా పార్టీ నడక సాగిస్తోంది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విజయదుందుభి మోగించడానికి సిద్ధమవుతోంది. సినిమా రంగంలోనూ, రాజకీయరంగంలోనూ.. వెరసి ప్రజా జీవితంలో తాను ఉన్నప్పుడే కాదు.. తన తదనంతరం కూడా తన ప్రభావం కొనసాగేలా చేయగలగడం ఒక్క యన్టీఆర్‌కే చెల్లింది. అందుకే ఆయన యుగపురుషుడని, శకపురుషుడని చరిత్ర ఆయనకు నీరాజనాలు పలుకుతోంది. యన్టీఆర్‌ ఆశయసాధన కోసం పాటుపడేవారందరూ మళ్ళీ ‘తెలుగుదేశం’ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. యన్టీఆర్‌ ఉండగా, తెలుగుదేశం సాధించిన ఘనవిజయాల కోవకు చెందే రీతిన విజయం సాధించాలని అన్న గారి అభిమానులు ఆశిస్తున్నారు. వారి సంకల్పం ఫలించాలని, యన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కోరుకుందాం.

కొమ్మినేని వేంకటేశ్వరరావు

Updated Date - Jan 18 , 2024 | 05:37 AM