A hit pair : హిట్‌ జోడీ... మరోసారి

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:38 AM

చిత్ర సీమలో హిట్‌ జోడీకి ఉండే క్రేజే వేరు. ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్‌ జంట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే.. ఆ మ్యాజిక్‌ మరోసారి కచ్చితంగా రిపీట్‌ అవుతుందనేది దర్శకనిర్మాతల నమ్మకం...

A hit pair : హిట్‌ జోడీ... మరోసారి

చిత్ర సీమలో హిట్‌ జోడీకి ఉండే క్రేజే వేరు. ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్‌ జంట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే.. ఆ మ్యాజిక్‌ మరోసారి కచ్చితంగా రిపీట్‌ అవుతుందనేది దర్శకనిర్మాతల నమ్మకం. అందుకనే అలాంటి హిట్‌ కాంబోను మరోసారి తెరపై తీసుకురావడానికి మేకర్స్‌.. ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలా తెలుగుతెరపై క్లిక్‌ అయి.. ప్రేక్షకుల్ని మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్న జోడీలివే.

55-Cj.jpg

‘ధమాకా’ కాంబో

రవితేజ, శ్రీలీల కలసి నటించిన చిత్రం ‘ధమాకా’. ఈ సినిమా వింటేజ్‌ రవితేజ స్టైల్‌ యాక్టింగ్‌ని ప్రేక్షకులకి మరోసారి గుర్తుచేయగా.. యంగ్‌బ్యూటీ శ్రీలీలను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసి మరిన్ని చిత్రాల్లో అవకాశాలను తెచ్చిపెట్టింది. రవితేజ మార్క్‌ మాస్‌ కామెడీ టైమింగ్‌, శ్రీలీల క్యూట్‌ పెర్ఫార్మెన్స్‌ బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించి.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ పెయిర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడటంతో మరోసారి వీరి కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో భాను బోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్‌టీ75’ సినిమా వర్కింగ్‌ టైటిల్‌.


66-Cj.jpg

‘ఎక్స్‌ట్రార్డినరీ’ జంట

నితిన్‌, శ్రీలీల కలయికలో వచ్చిన చిత్రం ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద అంచనాలను అందుకోకపోయినా.. నితిన్‌, శ్రీలీల కాంబోకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో వీరిద్దరి మధ్య ఆన్‌స్ర్కీన్‌ కెమిస్ట్రీ బాగా కుదరడంతో వీరి కలయికలో మరో సినిమా తెరకెక్కుతోంది. నితిన్‌తో ‘భీష్మ’ సినిమా తెరకెక్కించి హిట్‌ అందుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకుడు. ‘రాబిన్‌హుడ్‌’ పేరుతో వస్తోన్న ఈ సినిమాను నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ‘రాబిన్‌హుడ్‌’ సినిమాతో నితిన్‌, శ్రీలీల జంట తెరపై ఈ సారి ఎలాంటి మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారో చూడాలంటే డిసెంబరు 20 వరకు వెయిట్‌ చేయక తప్పదు.


33-Cj.jpg

మూడోసారి ప్రేక్షకుల మది దోచడానికి

అర్జున్‌ రెడ్డి వంటి సంచలన విజయం తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘గీతా గోవిందం’. ఈ సినిమాలో విజయ్‌ సరసన రష్మిక మండన్న మొదటిసారి నటించారు. 2018లో పరశురామ్‌ దర్శకత్వంలో విడుదలైన ఈ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ ఆ ఏటి మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తెరమీద ‘గీత’ పాత్రలో రష్మిక, ‘గోవిందం’ పాత్రలో విజయ్‌ కాంబో ప్రేక్షకుల్ని అంతగా అలరించింది మరి. ఆ తరువాత వారిద్దరూ మరోసారి తెరపై ప్రేమికులుగా కనిపించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. 2019లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా వర్కౌట్‌ కాకపోయినా.. కల్ట్‌ హిట్‌గా అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. ఇందులో ‘బాబీ’గా విజయ్‌, ‘లిల్లీ’గా రష్మిక ప్రేమికులంటే ఇలానే ఉండాలనేలా మెప్పించారు. ఈ సినిమా తర్వాత వారిద్దరూ రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డారని కొన్నాళ్లు జోరుగా ప్రచారం సాగింది. ‘డియర్‌ కామ్రేడ్‌’ తరువాత మరోసారి వీళ్లని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూశారంటే ఈ కాంబోకున్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రేజీ కాంబో ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను పలకరించను సిద్ధమైంది. విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్‌ సంక్రితియాన్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘వీడీ 14’. త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్న ఈ చిత్రంతో విజయ్‌, రష్మిక జోడీ తెరపై ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.


11-Cj.jpg

సూపర్‌హిట్‌ కొట్టేందుకు మరోసారి...

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ‘బేబీ’ చిత్రం సూపర్‌ సక్సెస్‌ను సాధించింది. ఈ ట్రయాంగులర్‌ లవ్‌స్టోరీని సాయిరాజేశ్‌ నీలమ్‌ తెరకెక్కించగా, ఎస్‌.కే.ఎన్‌ నిర్మించారు. 2023 జూలైలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామాలో అమాయకుడిగా.. సిన్సియర్‌ లవర్‌గా ఆనంద్‌, మొదట బస్తీ అమ్మాయిగా ఉండి.. హఠాత్తుగా మోడరన్‌ అమ్మాయిగా మారిన వైష్ణవి చైతన్య నటన అందర్నీ మెప్పించింది. నిజం చెప్పాలంటే వీరి పాత్రల్ని మలిచిన తీరే సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లింది. ఈ సూపర్‌ హిట్‌ పెయిర్‌ ఇప్పుడు మరోసారి తెరపై కనువిందు చేయనుంది. రవి నంబూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ స్టేజిలో ఉంది.


44-Cj.jpg

‘సరిపోదా’తో మరోసారి

నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రంతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక అరుల్‌ మోహన్‌. 2018లో విడుదలైన ఈ సినిమాలో చలాకీ రైటర్‌గా నాని, పక్కింటి అమ్మాయి పాత్రలో ప్రియాంక చక్కగా నటించి ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నారు. విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ రివెంజ్‌ కామెడీ డ్రామా యావరేజ్‌గా నిలిచినప్పటికీ ఈ చిత్రంలో నాని, ప్రియాంక మధ్య వచ్చే సన్నివేశాలు యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘హొయ్‌నా హొయ్‌నా’, ‘నిను చూసే ఆనందంలో’ పాటల్లోని వీరి లవ్‌ట్రాక్‌ ఎంతో చూడముచ్చటగా ఉండి.. ఈ కాంబోని మరోసారి చూడాలని ఎదురుచూసేలా చేశాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత నాని, ప్రియాంక మోహన్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘సరిపోదా శనివారం’లో మరోసారి తెరపై తళుక్కుమంటున్నారు. ఆగస్టు 29న చిత్రం విడుదలవుతోంది.


22-Cj.jpg

ముచ్చటగొలిపేందుకు సిద్ధం

నాగచైతన్య, సాయిపల్లవి 2021లో విడుదలైన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని చైతన్య, సాయిపల్లవి జోడీ అందరినీ ముచ్చటగొలిపింది. సినిమాలో వీరి ప్రేమకథను చూసినవారందరూ ఈ జంటకు ‘ఫిదా’ అయిపోయారు. తెరపై లవర్స్‌గా సక్సెస్‌ కొట్టేసిన వీరిద్దరూ మూడేళ్ల తర్వాత మరోసారి నటించడానికి సిద్ధమయ్యారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్‌’ మూవీలో నాగచైతన్య జాలరి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌.. ముఖ్యంగా అందులోని బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే అనే డైలాగ్‌ సినిమాలో వీరిద్దరి మధ్య అద్భుతమైన లవ్‌స్టోరీ ఉందబోతోందంటూ ప్రేక్షకులకు హింటిచ్చింది.

Updated Date - Jun 28 , 2024 | 04:39 AM