మలయాళ సినిమాకు రూ.700 కోట్ల నష్టం

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:29 AM

ప్రతీ ఏడాది విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మలయాళ చిత్ర పరిశ్రమ. కానీ ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయినట్లు కేరళ చిత్ర నిర్మాతల సంఘం...

ప్రతీ ఏడాది విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మలయాళ చిత్ర పరిశ్రమ. కానీ ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయినట్లు కేరళ చిత్ర నిర్మాతల సంఘం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఏడాది రూ. 1000 కోట్లు పెట్టి 199 సినిమాలు నిర్మించగా.. కేవలం 26 చిత్రాలు మాత్రమే విజయతీరాలకు చేరాయని తెలిపింది.


పారితోషికమే పెద్ద సమస్య

‘‘సినిమాల బడ్జెట్‌ అదుపులో ఉంటే ఉండాలి. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయాలి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా ఫ్లాప్‌ అయ్యినందున ప్రొడక్షన్‌ ఖర్చుల్లో కోత విధించాలి. నటీనటుల పారితోషికం ఒక పెద్ద సమస్యగా మారింది. నటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి సిద్ధపడాలి. ఈ విషయాన్ని పలుసార్లు నటీనటులతో ప్రస్తావించాం. కానీ వారు తగ్గించుకోకపోగా మరింతగా పారితోషికాన్ని పెంచుకుంటున్నారు. నటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోకుంటే తీవ్ర సంక్షోభం తప్పదు. పక్క రాష్ట్రాల్లో తగిన మార్కెట్‌ లేకుండా ఏడాదికి దాదాపు 200 చిత్రాలు నిర్మించడం దీర్ఘకాలంలో పరిశ్రమ మనుగడకు చేటు చేస్తుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో స్టార్‌ హీరోలు నటించిన వాటికంటే మోస్తరు బడ్జెట్‌తో నిర్మించినవే హిట్‌ అవ్వడాన్ని మేకర్స్‌ గమనించాలి. అందుకు తగ్గట్లు సినిమాల నిర్మాణంలో మార్పులు చేసుకోవాలి. థియేటర్లకు ప్రజలని రప్పించే సినిమాలపై దృష్టి పెట్టాలి. ఈ ఏడాది మొత్తం 199 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కేవలం 26 చిత్రాలు విజయవంతం అయ్యాయి. రూ.1000 కోట్ల పెట్టుబడి పెడితే కేవలం రూ.300 కోట్లు మాత్రమే తిరిగి పొందగలిగాము. రూ.700 కోట్ల నష్టం వచ్చింది’’ అని రిపోర్ట్‌లో కేరళ చిత్ర నిర్మాతల సంఘం పేర్కొంది.

Updated Date - Dec 30 , 2024 | 04:29 AM