PM Modi: ది సబర్మతి రిపోర్ట్.. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి

ABN , Publish Date - Nov 17 , 2024 | 07:21 PM

'ది సబర్మతి రిపోర్ట్'' (The Sabarmati Report) సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అదివారం ప్రశంసలు కురిపించారు. ''నిజం బయటకు వస్తోంది'' అని వ్యాఖ్యానించారు

''ది సబర్మతి రిపోర్ట్'' (The Sabarmati Report) సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అదివారం ప్రశంసలు కురిపించారు. ''నిజం బయటకు వస్తోంది'' అని వ్యాఖ్యానించారు. ''కల్పితమైన కథనాలు కొంత కాలానికే పరిమితమవుతాయి. సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నారు. సినిమా ట్రయిలర్‌ను తనకు ట్యాగ్ చేస్తూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టుపై ప్రధాని ఈ స్పందనను తెలియజేశారు.

'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌‌ ఎస్-6 కోచ్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. హిందూ భక్తులు అయోధ్య నుంచి తిరిగి వస్తుండగా గోద్రాలో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అదే ఏడాది గుజరాత్‌లో అల్లర్లకు దారితీసింది. ఈ ఘటనల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను రూపొందించారు. శుక్రవారం విడుదల ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా, రిథి డోగ్రా ప్రధాన పాత్రలు పోషించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, అమూల్ వి.మోహన్, అన్షుల్ మోహన్ నిర్మించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలోనూ పలు సినిమాలను ప్రశంసించారు. 2022లో వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని మోదీ ప్రశంసించారు. దశాబ్దాలుగా దాచిపెట్టిన నిజం ఇన్నాళ్ల వరకూ బయటకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని, ఇలాంటి సమయంలో నిజం వెంట నిలబడటం నిజం కోసం బతికేవాళ్ల బాధ్యత అని మోదీ అన్నారు. గత ఏడాది కర్ణాటకలో ప్రచారం సమయంలోనూ 'ది కేరళ స్టోరీ' చిత్రం ప్రస్తావన చేశారు. సమాజంలో, ముఖ్యంగా కఠోర పరిశ్రమ, ప్రతిభ, మేథావులతో కూడిన కేరళ వంటి సుందర ప్రదేశంలో టెర్రరిజం పరిణామాలను ఈ చిత్రం బహిర్గతం చేసిందన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 07:21 PM