Fighter: యూనిఫార్మ్ వేసుకొని ముద్దు సన్నివేశాలేంటి? లీగల్ నోటీసు పంపిన ఐఏఎఫ్ అధికారి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:22 AM

హృతిక్ రోషన్, దీపికా పడుకోన్ జంటగా నటించిన 'ఫైటర్' ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య దీప్‌దాస్‌ ఈ సినిమాలో రన్ వే మీద ముద్దు పెట్టుకునే సన్నివేశంపై సీరియస్ అయ్యారు, అందుకు ఆమె లీగల్ నోటీసులు ఈ సినిమా నిర్మాతకి జారీ చేశారు.

Fighter: యూనిఫార్మ్ వేసుకొని ముద్దు సన్నివేశాలేంటి? లీగల్ నోటీసు పంపిన ఐఏఎఫ్ అధికారి
A still from Fighter

హృతిక్ రోషన్, దీపికా పడుకోన్ జంటగా నటించిన హిందీ సినిమా 'ఫైటర్' జనవరి 25న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో ఒక సన్నివేశం వివాదానికి దారితీయడమే కాకుండా, న్యాయపరమైన చిక్కులో కూడా పడింది. ఈ సినిమాలో దీపిక, హృతిక్ రోషన్ లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) యూనిఫామ్‌లో ఉంటూ ఒక ముద్దు సన్నివేశంలో నటించారు. ఇప్పుడు ఈ సన్నివేశం వివాదానికి దారితీసింది.

అస్సాంకి చెందిన IAF అధికారి, వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్, ఈ 'ఫైటర్' చిత్రనిర్మాతలకు పరువు నష్టం నోటీసు పంపించారు. అదీ కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను తప్పుగా కూడా ఈ సన్నివేశంలో చూపించారని ఆరోపిస్తూ ఈ లీగల్ నోటీసు పంపారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో హృతిక్ రోషన్, దీపికా పడుకొనే ఇద్దరూ IAF యూనిఫాం ధరించి, రన్‌వేపై ఈ ముద్దు సన్నివేశంలో నటించారు. ఈ సన్నివేశానికి వింగ్ కమాండర్ దాస్ ఆక్షేపణలు తెలుపుతూ, యూనిఫార్మ్ లో వున్నప్పుడు ఇలాంటివి ఎలా చేస్తారు, ఇది ఎయిర్ ఫోర్స్ ని కించపరచటమే అని ఆరోపించారు.

fighter.jpg

సినిమాలో రన్‌వేపై డ్యూటీలో వున్న ఇద్దరు అధికారులు ఇలా ముద్దు పెట్టుకోవడం క్రమశిక్షణ చర్య కిందకి వస్తుందని, అలాంటివి సినిమాలో ఎలా పెడతారని ఆమె అన్నారు. అంతేకాకుండా, ఈ సన్నివేశం వలన అధికారుల మధ్య సత్ప్రవర్తన లేనట్టుగా చూపించడం జరిగిందని, ఇలాంటి సన్నివేశాలు చూపించటం వలన భారత ఎయిర్ ఫోర్స్ ని భంగపరిచినట్టుగా ఉందని ఆమె ఆరోపించారు. రన్ వె అనేది చాలా సున్నితమైన ప్రదేశం అని, అటువంటి రన్ వే పై ఇద్దరు ఆఫీసర్లు డ్యూటీలో ఉంటూ లిప్ లాక్ సన్నివేశాలు చూపించడం బాగోదని చెప్పారు. అందుకని సినిమాలో ఆ ముద్దు సన్నివేశాన్ని తొలగించాలని అలాగే ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని దానికి తగిన పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

హ్రితిక్ రోషన్ ఈ సినిమా గురించి ఎంతో కష్టపడినట్టుగా సినిమా ప్రచారంలో భాగంగా చెప్పారు. అలాగే ఈ సినిమా విజయం పట్ల కూడా తాను హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ న్యాయపరమైన నోటీసుకు చిత్ర నిర్మాతల నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు.

Updated Date - Feb 07 , 2024 | 11:22 AM