మొన్న సమంత, నిన్న నిహారిక ఇప్పుడు మరో హీరోయిన్ విడాకులు

ABN , Publish Date - Feb 08 , 2024 | 01:42 PM

బాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ జంట ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తె ఈషా డియోల్ తన పన్నెండేళ్ల వివాహ బంధానికి తెర దించుతూ భర్త భరత్ తో స్నేహపూర్వక వాతావరణంలో విడాకులు తీసుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

మొన్న సమంత, నిన్న నిహారిక ఇప్పుడు మరో హీరోయిన్ విడాకులు
Esha Deol and her husband Bharath announced their separation after 12 years of their marriage

టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఈమధ్య విడాకుల వార్తలతో హెడ్ లైన్స్ లో వున్నారు. సమంత, నిహారిక ఇలా ప్రాముఖ్యం చెందిన యువ నటీమణులు తమ విడాకుల గురించి సామజిక మాధ్యమాల్లో ప్రకటించి తరువాత ఆ విషయం గురించి కొన్ని మీడియా చానెల్స్ తో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇంకో నటీమణి కూడా తన విడాకుల గురించి అధికారికంగా స్పందించి ఆమె మీద ఎప్పటినుండో వస్తున్న వార్తలకు ఒక అధికారిక ప్రకటన ఇచ్చింది.

eeshadeol.jpg

ప్రముఖ సీనియర్ నటులైన హేమమాలిని, ధర్మేంద్రల కుమార్తె, బాలీవుడ్ నటి అయిన ఈషా డియోల్ ఆమె భర్త భరత్ తఖ్తానీతో తన 12 సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని వారాలుగా వీరిద్దరి గురించి బాలీవుడ్ లో అనేక వార్తలు వస్తుండటం, హేమమాలిని 75వ జన్మదిన సంబరాలకు భరత్ దూరంగా ఉండటంతో, వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు బాగా వ్యాప్తి చెందాయి. దీనికి సమాధానంగా ఈషా డియోల్, ఆమె భర్త ఇద్దరూ కలిపి అధికారికంగా తామిద్దరూ విడిపోతున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇద్దరం స్నేహితులుగా కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రకటించారు.

eeshadeolbharath.jpg

వీరిద్దరి వివాహం, 2012లో ముంబైలోని ఇస్కాన్ ఆలయంలో అతి నిరాడంబరంగా జరిగింది. పన్నెండు సంవత్సరాల వివాహ బంధాన్ని ఇక కొనసాగించడం కష్టమని, అయితే తమ పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ఈషా, భరత్ లు ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టుగా ఆ ప్రకటనలో తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు రాధ్య (2017), మిరయా (2019). ఈషా డియోల్ దక్షిణాది సినిమా 'యువ' లో నటించారు. ఈ సినిమాకి మణిరత్నం దర్శకుడు.

Updated Date - Feb 08 , 2024 | 01:45 PM